వ్యాలెట్ పార్కింగ్ చేస్తనని చెప్పి.. ఖరీదైన కార్లతో పరార్

వ్యాలెట్ పార్కింగ్ చేస్తనని చెప్పి.. ఖరీదైన కార్లతో పరార్
  • నంబర్ ప్లేట్ మార్చి రోడ్లపై చక్కర్లు
  • లగ్జరీ కార్లపై మోజుతో చోరీలు చేస్తున్న యువకుడి అరెస్ట్ 
  • రూ.కోటి 70 లక్షల విలువైన రెండు బీఎండబ్ల్యూలు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: వ్యాలెట్ పార్కింగ్ చేస్తనని చెప్పి ఖరీదైన కార్లను కొట్టేస్తున్న యువకుడిని గచ్చిబౌలి, మాదాపూర్ జోన్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం​కు చెందిన బైరెడ్డి అర్జున్ రెడ్డి(29) గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్నాడు. ఇంటర్ చదివిన అర్జున్ రెడ్డి ప్రస్తుతం వెబ్ సైట్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. ఖరీదైన లగ్జరీ కార్లపై మోజుతో వాటిని కొట్టేసేందుకు స్కెచ్​ వేశాడు. పబ్ లు, ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో వ్యాలెట్ పార్కింగ్ పేరు చెప్పి అక్కడికి వచ్చే వారి కార్లను తీసుకుని ఎస్కేప్ అయ్యేవాడు.  ఈ నెల 24న కొండాపూర్ కు చెందిన మనోజ్ఞ గచ్చిబౌలి బైల్డర్ హిల్స్​లో జరిగిన బాద్​షా మ్యూజికల్ ఈవెంట్​కు తన బీఎండబ్ల్యూ జెడ్​4 కారులో వచ్చింది. అక్కడే ఉన్న అర్జున్​రెడ్డి.. తాను వ్యాలెట్​పార్కింగ్ డ్రైవర్​ అని ఆమెకు చెప్పాడు. కస్టమర్ డీటెయిల్స్ పేరుతో తన ఫోన్ లో ఓ ఫేక్ పేజ్ ను ఆమెకు చూపించి వివరాలు తీసుకున్నాడు. కారు పార్కింగ్ చేస్తానని చెప్పి తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.  దీంతో మనోజ్ఞ  గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

 ఇలా దొరికిండు..

కొట్టేసిన కారును అర్జున్​రెడ్డి స్టార్ హోటల్స్​లో పార్కింగ్ చేసేవాడు. అప్పుడప్పుడు నంబర్ ప్లేట్ మార్చి రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ పార్కింగ్ ఏరియా  నుంచి కారును బయటికి తీస్తున్న అర్జున్ రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతేడాది మే నెలలో గచ్చిబౌలిలోని జీరో 40 పబ్ కు వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన బీఎండబ్ల్యూ ఎక్స్ 5 కారును సైతం అర్జున్ రెడ్డి కొట్టేసినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మనోజ్ఞ, రాజశేఖర్ రెడ్డికి చెందిన కార్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. వీటి విలువ రూ. కోటి 70 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలిచినట్లు ఆమె తెలిపారు.