వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ

వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ

భారత స్టార్ ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.  ఐపీఎల్ 2024 సీజన్‌లో కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నా.. కేవలం అవి తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే తప్ప, జట్టు ప్రయోజనాల కోసం ఆడట్లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవైపు యువ క్రికెటర్లు రెచ్చిపోయి ఆడుతుంటే, కోహ్లీ మాత్రం వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. అలాంటి వారందరిపై కోహ్లీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం విరుచుకుపడ్డాడు. 

ఆదివారం(ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్.. బెంగళూరు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆపై మ్యాచ్ ముగిసిన అనంతరం పోస్ట్ ప్రెసెంటేషన్‌లో విమర్శకులకు గట్టిగా బద్దిచెప్పాడు. 

"నేను స్పిన్‌ను ఎదుర్కోలేకపోతున్నానని.. స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. కామెంటరీ బాక్స్‌లో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. ప్రతి మ్యాచ్‌లో మేము విజయం కోసమే  ఆడతాం. ఆత్మగౌరవంతో మ్యాచ్‌లను ఆడతాం. మంచి ప్రదర్శన చేయబట్టే 15 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్నా. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్‌ పరిస్థితి తెలియదు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు.." అని విరాట్  పోస్ట్ ప్రెసెంటేషన్‌లో మాట్లాడాడు.

క్రికెట్ ప్రేమికులకు కోహ్లి దేవుడు

భారత మాజీ ఆల్ రౌండర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. విరాట్ మనిషి, కాబట్టి మనిషిలా ఆడతాడని, వ్యక్తిగత విమర్శలు చేసేముందు అతని గణాంకాలను చూసి మాట్లాడాలని బుద్ధిచెప్పాడు.

"ప్రజలు కోహ్లిని దేవుడని అనుకుంటారు.. అతను మనిషి, కాబట్టి మనిషిలా ఆడతాడు. అతని క్రికెట్ కెరీర్ లో 80 సెంచరీలు ఉన్నాయి. అవెందుకు మనం చూడకూడదు. ప్రతి మ్యాచ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాడు. అదే అతని బలం, బలహీనత. మీరు నిశ్చితంగా పరిశీలించండి.. ఈ రోజు(గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ను ఉద్దేశిస్తూ) అతను స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.. మున్ముందు ఎంత మందికైనా బదులివ్వగలడు. ఇంకా ఏమి చేయాలి?.." అని సిద్ధూ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

కాగా, గుజరాత్‌పై విజయంతో బెంగళూరు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, ఆర్సీబీ జట్టు తదుపరి దశకు అర్హత సాధించాలంటే ఇలాంటి విజయాలు మరిన్ని అవసరం.