ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటలుగా మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 


సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అటు లిక్కర్‌ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. అయితే ఈ  స్కామ్‌కి సంబంధించి బ్యూరోక్రాట్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. బుచ్చిబాబు,గౌతమ్ మల్హోత్రా సహా  పలువురిని అరెస్ట్ చేసింది.  ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రెండోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 26న విచారణకు రావాలని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.  అయితే  ఈనెల 18న సిసోడియాకు తొలిసారి సీబీఐ సమన్లు పంపింది. ఈ నెల 19న విచారణకు రావాలని పేర్కొంది. కానీ  బడ్జెట్ రూపకల్పనలో ఉన్న కారణంగా  తాను సీబీఐ విచారణకు హాజరుకాలేనని..నెలాఖరులో వస్తానని మనీష్ సిసోడియా సీబీఐకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ ఈనెల 26న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరైన సిసోడియాను సీబీఐ 8 గంటలకు పైగా విచారించి..చివరకు అరెస్ట్ చేసింది.