రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. జోధ్ పూర్ లోని ఆయన ఇంటితో పాటు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. 

ఎరువుల వ్యాపారి అయిన అగ్రసేన్ గెహ్లోత్ కు అనుపమ్ కృషి అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ‘సరాఫ్ ఇంపెక్స్’ ద్వారా పొటాష్‌ను విదేశాలకు ఎగుమతి చేసిందని ఈడీ తెలిపింది. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి అగ్రసేన్ గెహ్లోత్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఆయన 2007, 2009లో భారీ ఎత్తున ఎరువుల అక్రమ ఎగుమతికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. దేశ రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఎక్స్ పోర్టింగ్ కంపెనీ ‘సరఫ్ ఇంపెక్స్’తో పాటు ఇతర కంపెనీలపైనా మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. 

రాజకీయ కక్ష సాధింపు చర్య : కాంగ్రెస్ 
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి సోదరుడి నివాసంలో సీబీఐ సోదాలు జరిపింది. ఇవన్నీ ప్రతికార రాజకీయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయ చర్యగా అభివర్ణించారు. ‘గత మూడు రోజులుగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ముందుండి నడిపించారు. అందుకే బీజేపీ నిస్సిగ్గుగా ఈ సోదాలను చేపట్టింది. అయినా మేము మౌనంగా ఉండబోం’ రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ప్రస్తవించారు. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.