మెట్రోకు మళ్లీ కేంద్రం బ్రేకులు.. కేంద్రంతో CM రేవంత్ చర్చలు జరిగి నెల గడిచినా కదలని ఫైల్‌‌‌‌‌‌‌‌

మెట్రోకు మళ్లీ కేంద్రం బ్రేకులు.. కేంద్రంతో CM రేవంత్ చర్చలు జరిగి నెల గడిచినా కదలని ఫైల్‌‌‌‌‌‌‌‌
  • మెట్రో ఫేజ్-1 టేకోవర్, ఫేజ్-2 వాల్యుయేషన్ కోసం నేటికీ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ను నియమించని కేంద్రం
  • ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ క్యాప్​ నుంచి రెండు నెలల్లోనే నివేదిక తీసుకోవాలని అప్పట్లో నిర్ణయం.. ఇప్పటికే నెల గడిచినా, సీఎం లేఖ రాసినా స్పందన కరువు
  • తాజాగా ఫేజ్- 1ను రాష్ట్రం టేకోవర్​ చేసుకుంటే.. ఫేజ్-​ 2 ను కేబినెట్​ ముందుకు తెస్తామని మెలిక
  • ప్రత్యామ్నాయాలపై  దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు
  • మంజూరైన ఐఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ రుణం ఇప్పించుకోవడంపై సర్కారు ఫోకస్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, ఫేజ్​–1 స్వాధీనంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తొక్కిపెట్టింది. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై నెల రోజులు గడిచినా, ఆ తర్వాత స్వయంగా లేఖ రాసినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఎలాంటి  పురోగతి కనిపించకపోవడం తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నది.

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రుల భేటీలో మెట్రో ఫేజ్–-1 టేకోవర్, ఫేజ్–-2 వాల్యుయేషన్, రుణ సమీకరణ బాధ్యతలను కేంద్రం ఎంప్యానెల్ చేసిన ‘ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ క్యాప్స్’కు అప్పగించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. కానీ  నేటికీ ఆ సంస్థను కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌గా నియమించకపోవడంతో కేంద్రం తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. 

ఇదే విషయమై ఇటీవల కేంద్రాన్ని మరోసారి సంప్రదించగా  ఫేజ్–1ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేకోవర్ చేసుకుంటేనే ఫేజ్-–2ను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తామంటూ పాత పాట అందుకున్నది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు సంబంధించి ఇప్పటికే మంజూరైన  ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ రుణం ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు   ప్రైవేట్ బ్యాంకింగ్, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను  అన్వేషించాలని ఉన్నతాధికారులను  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ రుణం ఇప్పించండి.. లేదంటే  ప్రైవేట్ రుణమే

మెట్రో ఫేజ్-–1 స్వాధీనానికి సంబంధించి ఎల్ అండ్ టీకి ఇవ్వాల్సిన నిధుల కోసం  ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ (ఇండియన్​ రైల్వే ఫైనాన్స్​ కార్పొరేషన్​) గతంలో రూ.13,527 కోట్ల రుణం మంజూరు చేసింది.  కానీ చివరి నిమిషంలో  కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పడంతో  ఆ రుణం అర్ధంతరంగా 
నిలిచిపోయింది.  అందులో భాగంగానే  కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సవాల్​ విసిరి పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయించారు.

కానీ అక్కడ సీన్​ రివర్స్​ అయింది.  ఫేజ్​ 1, 2  రెండింటిని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకురావాలని, ఇందుకోసం వాల్యూయేషన్ చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఆ తర్వాత కేంద్రం ఆ ప్రక్రియను గాలికొదిలేసింది. ఎంతకూ స్పందన లేకపోవడంతో కేంద్ర అధికారులను ఉన్నతాధికారులు సంప్రదించారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఫేజ్​ –1ను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా టేకోవర్​ చేసుకోవాలంటూ తాజాగా సంకేతాలు పంపింది. 

 చర్చలకు భిన్నంగా కేంద్ర అధికారులు స్పందించడంతో హైదరాబాద్​మెట్రోపై కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర సర్కారు అంచనాకు వచ్చింది.  ఈ క్రమంలో ఇప్పటికే మంజూరైన ఐఆర్ఎఫ్‌‌‌‌సీ రుణాన్ని విడుదల చేయించేలా కేంద్రంపై  ఒత్తిడి తీసుకురావాలని, అదే సమయంలో  ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోన్ల కోసం కసరత్తు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఐసీఐసీఐలాంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలేవైనా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే, త్వరితగతిన నిధులు సేకరించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.  

ఏడాదిన్నర నుంచి అడుగడుగునా అడ్డంకులే 

హైదరాబాద్​ మెట్రో విస్తరణను కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేజ్​–2 విషయంలో దాదాపు ఏడాదిన్నర నుంచి కేంద్రం ఆమోదం తెలియజేయకుండా కొర్రీలు వేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.  మెట్రో ఫేజ్–-2 విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 43 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇందులో కేటగిరీ ‘ఏ’ కింద ఐదు కారిడార్లు, కేటగిరీ ‘బీ’ కింద మరో మూడు కారిడార్లను మొత్తం 162.5 కిలోమీటర్ల మేర నిర్మించేలా డీపీఆర్​ పంపారు. 

కానీ డీపీఆర్ సరిగ్గా లేదని మళ్లీ తిరిగి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో చిన్న మార్పులు చేసి పంపింది. కానీ హైదరాబాద్​ మెట్రోను పక్కన పెట్టి..  ఏపీ, గుజరాత్​ రాష్ట్రాల మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా మెట్రో ఫేజ్–1 ను రాష్ట్రం టేకోవర్​చేస్తే.. ఫేజ్​ 2కు అనుమతులు ఇస్తామని కేంద్రం తెలిపింది. 

ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థకు ఉన్న 100 శాతం షేర్లను రూ. 1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది.  దీంతో మెట్రో సంస్థపై ఉన్న సుమారు రూ. 13,538.53 కోట్ల భారీ రుణాన్ని జూన్​లోనే  రీఫైనాన్స్ చేసేలా ముందుకు వెళ్లింది.  జైకా నుంచి  తక్కువ వడ్డీ పునర్వ్యవస్థీకరణ రుణాన్ని ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్​సీ నుంచి మంజూరు చేయించుకున్నాక దానిని నిలిపివేసింది.  

ఇప్పుడు మళ్లీ ఫేజ్–​1ను రాష్ట్రమే టేకోవర్​ చేయాలని మెలికపెట్టడంతో హైదరాబాద్​మెట్రోకు సహకరించడం  కేంద్రానికి ససేమిరా ఇష్టంలేదనే విషయం అర్థమవుతోందని అధికారపార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మెట్రోను పూర్తిచేస్తే  కాంగ్రెస్​ ప్రభుత్వానికి పేరు వస్తుందని, అదే జరిగితే తమకు జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో నష్టం తప్పదనే ఉద్దేశంతోనే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర స్థాయిలో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.