- సర్పంచులు, ఉపసర్పంచుల డిజిటల్ కీలతో
- రాష్ట్ర సర్కారు పైసలెట్ల తీస్కుంటది?
- సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ. 300 కోట్లను విడుదల చేయగానే సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సంబంధం లేకుండా వారి డిజిటల్ కీతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేయడంపై రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఫైరయ్యారు. సర్పంచులు, ఉప సర్పంచ్ ల డిజిటల్ కీలను వారికి తెలియకుండా ఉపయోగించి నిధులను మళ్లించడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి మళ్లింపులు జరగలేదన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో వెంకటేష్ యాదవ్ మాట్లాడారు.
పంచాయతీలకు వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుండడం వల్లే కేంద్ర ప్రభుత్వం సర్పంచులు, ఉపసర్పంచ్ లకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు తీయించి వారే నిధులు డ్రా చేసేలా వారి సంతకాలతో డిజిటల్ కీలను ఇచ్చిందన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక గ్రామంలో ఏ పని చేయాలన్నా సర్పంచులు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరును మార్చుకొని కేంద్రం నుంచి వచ్చిన రూ. 300 కోట్ల నిధులను సర్పంచులు, ఉపసర్పంచ్ ల ఖాతాల్లో జమ చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

