లోక్ సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌‌..అన్ని పార్టీల మద్దతు కోసం చర్చలు

లోక్ సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌‌..అన్ని పార్టీల మద్దతు కోసం చర్చలు
  • ఇప్పటికే కొన్ని రీజనల్ పార్టీలతో  కేంద్రం సంప్రదింపులు
  • అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములా కోసం కసరత్తు
  • దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ముసాయిదా

దేశంలో లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను 2029 సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఒక కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను 2029 సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఒక కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం లోక్‌‌‌‌సభ స్థానాల(543 ) కేటాయింపు 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే కొనసాగుతున్నది. దశాబ్దాల క్రితం విధించిన ఈ రాజ్యాంగపరమైన గడువు ఇటీవల ముగిసింది. 

దాంతో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కీలక మార్పు వల్ల పార్లమెంట్‌‌‌‌లో వివిధ రాష్ట్రాలకు ఉండే సీట్ల సంఖ్య మారనుంది. ముఖ్యంగా, జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ అంశం దేశ రాజకీయాల్లో, సమాఖ్య వ్యవస్థలో తీవ్ర వివాదాలకు దారితీయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో అడుగులు వేస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అన్ని పార్టీల మద్దతు కోసం చర్చలు

ఈ సున్నితమైన సమస్యపై రాజకీయంగా ఎలాంటి చట్టం తీసుకురావాలన్నా అన్ని పార్టీల మద్దతు అవసరమని కేంద్రం భావిస్తోంది. అందుకే ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టకముందే ప్రధాన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వంటి పార్టీలతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. మిగిలిన ప్రాంతీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కొత్త ఫార్ములాను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.