ఉరిశిక్ష గైడ్​లైన్స్​ మార్చండి.. సుప్రీంను కోరిన కేంద్రం

ఉరిశిక్ష గైడ్​లైన్స్​ మార్చండి.. సుప్రీంను కోరిన కేంద్రం
  • రూల్స్ దోషుల తరఫున కాదు..బాధితుల కోణంలో ఉండాలె
  • నిర్భయ దోషుల ఉరితీతకు ముందు సుప్రీం కోర్టును

న్యూఢిల్లీఉరి శిక్ష అమలుకు సంబంధించిన గైడ్​లైన్స్​ను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా డెత్​ పెనాల్టీకి సంబంధించి దోషుల కోణంలో ఉన్న గైడ్​ లైన్స్​ను బాధితుల కోణంలో మార్చాలని హోంమంత్రిత్వ శాఖ కోరింది. సుప్రీంకోర్టుకు అందజేసిన అప్లికేషన్​లో.. దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్​ను కోర్టు తిరస్కరించాక క్యూరేటివ్ పిటిషన్​ పెట్టుకోవడానికి టైం లిమిట్​ పెట్టాలని హోంశాఖ కోరింది. టైం లిమిట్​ లేకపోవడం వల్ల శిక్ష అమలును వీలైనంత పోస్ట్​పోన్​ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలంటూ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే, దోషులు నలుగురు ఉరిశిక్ష అమలును సాధ్యమైనంత వరకూ పోస్ట్​పోన్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ల లాయర్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ నెల 22 న వారిని ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష అమలు కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్ కోర్టులో​ క్యూరేటివ్​ పిటిషన్​ పెట్టుకున్నాడు. కోర్టు దానిని తిరస్కరించడంతో రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును హోంశాఖ అధికారులు రికార్డు టైంలో ప్రాసెస్​ చేసి, దీనిని తిరస్కరించాలని సూచిస్తూ రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా వెంటనే స్పందించి, ముకేశ్​ సింగ్​ పిటిషన్​ను తిరస్కరించారు. అయితే, క్షమాభిక్ష పిటిషన్​ ను రాష్ట్రపతి తిరస్కరించాక ఉరి శిక్ష అమలుకు కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలనే రూల్​ వల్ల దోషుల ఉరి వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 1న దోషులను ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు మళ్లీ ఫ్రెష్​ డెత్​వారెంట్​ జారీ చేసింది. ఈ క్రమంలో మరో ఇద్దరు దోషులకు క్యూరేటివ్​ పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉండడంతో ఈసారి కూడా శిక్ష అమలు జరిగే అవకాశంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. దీనిపై సుప్రీం స్పందన ఎలా ఉండబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.