V6 News

ఎల్పీజీకి బదులు ఇథనాల్... మొదట్లో హోటల్స్‌‌‌‌లో వాడకం..ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం

ఎల్పీజీకి బదులు ఇథనాల్... మొదట్లో హోటల్స్‌‌‌‌లో వాడకం..ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం
  • వైట్​పేపర్​ తయారు చేస్తున్న అధికారులు
  • యుద్ధంతో గ్యాస్​ రాక ఇబ్బందులు

న్యూఢిల్లీ: వంట గ్యాస్ కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి కేంద్రం సరికొత్త ఆలోచన చేస్తోంది. వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీకి బదులు ఇథనాల్ ఉపయోగించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్​ సరఫరా భారీగా తగ్గి ఇంధన భద్రతకు సమస్యలు ఏర్పడిన సమయంలో ఈ ప్రపోజల్​ వచ్చింది. దేశంలో ప్రస్తుతం భారీగా పేరుకుపోయిన మిగులు బయో ఫ్యూయల్ నిల్వలను వంట ఇంధనంగా మళ్లించడం ద్వారా ఇటు జనానికి, అటు రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. 

ప్రస్తుతం దేశంలో సుమారు 1,000 కోట్ల లీటర్ల మిగులు ఇథనాల్ సామర్థ్యం అందుబాటులో ఉంది. దీనిని వంట అవసరాలకు మళ్లించేందుకు ఒక వైట్​పేపర్​ను తయారు చేస్తున్నారు. ఈ నివేదికను వచ్చే కొద్ది వారాల్లోనే వివిధ శాఖల మంత్రుల కమిటీకి సమర్పించనున్నారు. ఇథనాల్ అనేది ఎల్పీజీకి పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా దానికి అనుబంధమైన శుభ్రమైన వంట ఇంధనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా హోటళ్లు, విమానాశ్రయాలు, పెద్ద రెస్టారెంట్ల వంటి వాటిలో పెద్ద ఎత్తున  వాడొచ్చని అంటున్నారు. 

ఇప్పటికే ఇంధనంగా వాడకం

చెరకు, మొక్కజొన్న, నూకలు వంటి వాటిని పులియబెట్టడం ద్వారా ఇథనాల్​ తయారు చేస్తున్నారు.  ప్రస్తుతం దీనిని పెట్రోల్​లో కలిపి బయో ఫ్యూయల్​గా వాడుతున్నారు.  ఫలితంగా ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాలూ అదుపులోకి వచ్చాయి. అయితే వంట కోసం వాడే ఇథనాల్ మిశ్రమం వాహన ఇంధనం కన్నా భిన్నంగా ఉంటుంది. దీని తయారీ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. మొదట గృహ అవసరాల కోసం కాకుండా హోటళ్ల వంటి కమర్షియల్​ కిచెన్లలో దీనిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.   

దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. దాదాపు రెండు వేల కోట్ల లీటర్లకు చేరుకుంది. పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని చేరుకోవడానికి సుమారు 1,100 కోట్ల లీటర్లు కావాలి. ఈ అవసరం తీరిన తర్వాత కూడా దేశంలో వెయ్యి కోట్ల లీటర్ల మిగులు నిల్వలు ఉండే అవకాశం ఉంది.  ఇథనాల్ తయారీ రంగంలో ఇప్పటికే సుమారు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.   ప్రస్తుతం వాణిజ్య ఎల్పీజీ ధర కిలోకు రూ.103 వరకు ఉండగా హైడ్రస్ ఇథనాల్ ధర కిలోకు రూ.70 మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీని వల్ల హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది.

ఎల్పీజీ పైప్ లైన్ల కోసం రూ.12,500 కోట్లు

పెట్రోలియం సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్జీఆర్​బీ) సుమారు రూ.12,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన పైప్ లైన్ల బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహిస్తోంది. మొత్తం 2,500 కిలోమీటర్ల మేర సాగే ఈ పైప్ లైన్లు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఇందులో భాగంగా చర్లపల్లి నుంచి నాగపూర్, షిక్రాపూర్ నుంచి గోవా, పారాదీప్ నుంచి రాయ్ పూర్, ఝాన్సీ నుంచి సీతార్ గంజ్ వరకు పైప్ లైన్లు నిర్మిస్తారు. గ్యాస్ రవాణా భద్రతను పెంచడంతో పాటు ఖర్చును తగ్గించేందుకు ఈ మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయి.  ఈ భారీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 9 ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టులను పీఎన్జీఆర్‌‌‌‌బీ గుర్తించి బిడ్డింగ్ నిర్వహించింది.