- అప్పులపై చర్చకు తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి సవాల్
- పొద్దున్నే తెలంగాణ భవన్‌కు కేటీఆర్, హరీశ్ రావు.. భారీగా పోలీసుల మోహరింపు
- ఇటు గురుకుల అక్రమాల ఆరోపణలపై గన్‌పార్క్‌కు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్
- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్కేడర్.. గన్‌పార్క్‌కు రావాలని హరీశ్‌కు మంత్రుల సవాల్
- అక్కడికి వెళ్లేందుకు హరీశ్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. తోపులాటలో కిందపడ్డ నేత
- పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో కంచన్‌బాగ్ స్టేషన్‌కు తరలింపు
- అప్పులపై చర్చకు గన్‌పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీట్ పీక్స్‌కు చేరుకున్నది. అప్పులపై చర్చిద్దామన్న సవాళ్లకు కేటీఆర్, హరీశ్‌రావు, జూపల్లి సిద్ధమైతే.. గురుకులాల్లో అక్రమాల ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, బీఆర్‌ఎస్ నేత హరీశ్ సై అంటే సై అనడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు సంక్షేమంపై పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, కేటీఆర్‌కు మంత్రి జూపల్లి రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో హీట్ రాజుకుంది.
రైతుల సంక్షేమం, రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ, అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరితే.. ఎక్కడో ఎందుకు తెలంగాణ భవన్‌కే వస్తానని మంత్రి జూపల్లి ప్రతి సవాల్ చేశారు. దీంతో గురువారం ఉదయమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. ఇటు బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఉదయం నుంచే తెలంగాణ భవన్‌కు క్యూకట్టారు. సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అప్పులపై చర్చకు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణా రావు రావాలని కేటీఆర్, హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కోసం భవన్‌లో ప్రొటోకాల్ చైర్ ఏర్పాటు చేశారు. సన్మానానికి సిద్ధమయ్యారు. కాగా, ముందస్తు షెడ్యూల్‌ప్రకారం మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరై, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. హరీశ్ గన్‌పార్క్‌కు రావాలని, తన బామ్మర్దిని కూడా తీసుకుని వస్తే ఇద్దరికీ కలిపి సమాధానం చెప్తానని తేల్చి చెప్పారు.
గన్‌పార్క్ దగ్గర మంత్రులు
గురుకులాల టెండర్ల అక్రమాల ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ ఉదయమే గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రులు అంతకుముందే చేసిన సవాల్‌కు కట్టుబడి గన్‌పార్క్ చేరుకున్నారు. ఈ టెండర్లలో రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తూ.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమయ్యారు.
అంతకుముందే గన్‌పార్క్‌కు వచ్చిన మంత్రులు.. గురుకులాల టెండర్ల అక్రమాల ఆరోపణలపై హరీశ్ రావే గన్‌పార్క్ వద్దకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మొత్తం టెండర్ల విలువే రూ.1100 కోట్లు ఉన్నప్పుడు రూ.2 వేల కోట్ల అక్రమాలు ఎలా జరిగాయని మంత్రులు నిలదీశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా గన్‌పార్క్ వద్దకు భారీగా తరలివచ్చారు. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులను భారీగా మోహరించారు.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
మంత్రుల సవాల్‌తో హరీశ్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతల బృందం గన్‌పార్క్‌కు కారులో బయల్దేరింది. తెలంగాణభవన్ గేటు బయట పోలీసులు కారును అడ్డుకున్నారు. కారును ముందుకు కదలనివ్వలేదు. దీంతో పోలీసులతో హరీశ్ వాగ్వాదానికి దిగారు. మీ మంత్రులే రమ్మంటున్నరు.. ఎందుకు అడ్డుకుంటున్నరంటూ పోలీసులను ప్రశ్నించారు. కారులో కూర్చునే ముగ్గురు మంత్రులకు హరీశ్ ఫోన్ చేశారు. వారు ఫోన్ ఎత్తలేదు. పోలీసులు హరీశ్ కారును ఎంతకీ కదలనివ్వకపోవడంతో ఆయన కారుదిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు.
పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి హరీశ్ కిందపడిపోయారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన్ను పైకి లేపి మళ్లీ ముందుకువెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి కంట్రోల్లోకి రాకపోతుండడంతో పోలీసులు హరీశ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా పార్టీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్‌లో కంచన్‌బాగ్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మంత్రుల కోసం కుర్చీలు వేసి చర్చకు హరీశ్ సవాల్ విసిరారు.
కేటీఆరే గన్‌పార్క్ వద్దకు రావాలని జూపల్లి సవాల్ విసరడంతో కేటీఆర్ కూడా గన్‌పార్క్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ తెలంగాణభవన్ గేటు వద్దే పోలీసులు కేటీఆర్ సహా పార్టీ నేతలను అడ్డుకున్నారు. దీంతో వాళ్లు భవన్‌లో జూపల్లి కోసం వేచి చూశారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆ రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
