చంద్రయాన్-2: కొద్ది గంటల్లో జాబిల్లికి జర్నీ

చంద్రయాన్-2: కొద్ది గంటల్లో జాబిల్లికి జర్నీ
  • బాహుబలి రాకెట్​తో ప్రయోగం
  • రేపు తెల్లవారుజామున 2.51 గంటలకు రోదసిలోకి
  • సెప్టెంబర్​ 6 లేదా 7న చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండింగ్
  • చంద్రుడిపై ల్యాండర్​ దింపుతున్న నాలుగో దేశంగా ఇండియా

చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్–2’ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌‌ ధవన్‌‌ స్పేస్‌‌ సెంటర్‌‌ నుంచి సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ఇస్రో బాహుబలిగా పేరొందిన జీఎస్ఎల్వీ మార్క్‌‌–3 రాకెట్.. 3,877 కిలోల బరువున్న మాడ్యూళ్లను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కొద్ది నిమిషాల్లోనే భూమి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు ఇస్రో చైర్మన్​ కె.శివన్ వెల్లడించారు. శనివారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. వర్షం పడినా ప్రయోగానికి ఇబ్బందులేమీ ఉండకపోవచ్చని, జీఎస్ఎల్వీ మార్క్–3 ఆ పరిస్థితిని తట్టుకుని పైకి దూసుకెళ్తుందని తెలిపారు. అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లే ‘గగన్​యాన్’ప్రాజెక్టులో తొలి ప్రయోగాన్ని వచ్చే ఏడాది డిసెంబర్​లో చేపడతామని శివన్​ వెల్లడించారు. ఇప్పటికే ప్రాజెక్టు డిజైన్​ పూర్తయిందని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్​లో, 2021 జులైలో రెండుసార్లు మానవ రహితంగా ప్రయోగాలు చేస్తామని.. 2021 డిసెంబర్​లో మానవ సహిత ప్రయోగం ఉంటుందని చెప్పారు.