- వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగోస్థానం
పటాయ: వరల్డ్ వెయిట్ లిప్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా టాప్ ప్లేయర్ మీరాబాయి చాను త్రుటిలో మెడల్‌ను కోల్పోయింది. మహిళల 49 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె నేషనల్ రికార్డును నెలకొల్పినా నాలుగో స్థానంతో సరిపెట్టుకోలేక తప్పలేదు. గురువారం జరిగిన ఈ బౌట్‌లో తొలుత స్నాచ్‌లో 87 కేజీల బరువునెత్తిన చాను.. క్లీన్ అండ్ జెర్క్‌తో 114 కేజీలతో కలిపి ఓవరాల్‌గా 201 కేజీలనెత్తింది.

దీంతో గత ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ సందర్భంగా తను నెలకొల్పిన జాతీయ రికార్డు (199 కేజీలు)ను మెరుగు పరుచుకుంది. ఈ పోటీల్లో చైనా ప్లేయర్ జియాంగ్ హుయిహువా 212 కేజీలు లిఫ్ట్ చేసి కొత్త వరల్డ్ రికార్డుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. హౌ జిహుయ్ (211,చైనా), రి సోంగ్ గమ్ (204, దక్షిణకొరియా) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఇతర లిఫ్టర్లలో స్నేహ సోరెన్ (55 కేజీలు).. ఎనిమిది మంది పోటీ పడ్డ గ్రూప్–డిలో ఓవరాల్‌గా 173 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది. అన్ని గ్రూప్‌ల దశలు ముగిశాక ఆమె ప్లేస్‌పై స్పష్టత రానుంది.
