లోక్ సభలో అదే గందరగోళం.. మోడీ రిప్లయ్‎కి ముందే సభ వాయిదా

లోక్ సభలో అదే గందరగోళం.. మోడీ రిప్లయ్‎కి ముందే సభ వాయిదా

న్యూఢిల్లీ: లోక్ సభలో వరుసగా మూడోరోజు కూడా అదే గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం కూడా సభ ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో హోరెత్తింది. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్పీకర్ ఓం బిర్లా అనుమతి నిరాకరించడంతో అపొజిషన్ ఎంపీలు తీవ్ర గందరగోళం సృష్టించారు. 

దీంతో 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభలో క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు మొదలుపెట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు మళ్లీ ఆందోళనలకు దిగడంతో గందరగోళం నెలకొంది.

దీంతో సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే, రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఉన్న పోస్టర్లను కొందరు ఎంపీలు ప్రదర్శించారు. మరోవైపు గాంధీ ఫ్యామిలీ చరిత్ర చెప్తానంటూ పలు పుస్తకాలను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే బయటకు తీశారు. ఇంకా పబ్లిష్ కాని పుస్తకం గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలని అనుకుంటే.. తాను గాంధీ ఫ్యామిలీ అసలు చరిత్ర గురించి చెప్పేందుకు పుస్తకాలను తెచ్చానన్నారు. 

దీంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష మహిళా ఎంపీలు వర్షా గైక్వాడ్, జ్యోతిమణి, మరికొందరు ట్రెజరీ బెంచ్​లవైపు దూసుకెళ్లారు. ఇటు ప్రతిపక్ష ఎంపీలు, అటు దూబే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా ఎంపీలు కూడా దూబేకు మద్దతుగా ముందుకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్‎లో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి వారించినా వారు వినకపోవడంతో సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు.