బోరు వేస్తే వచ్చేది రసాయనాలే

 బోరు వేస్తే వచ్చేది రసాయనాలే

మేడ్చల్​జిల్లా కుత్బుల్లాపూర్​సర్కిల్ ​కార్యాలయంలో పార్కు నిర్వహణ కోసం అధికారులు నెలరోజుల క్రితం బోరు వేయించారు. పుష్కలంగా నీరు పడింది. మోటారు బిగించి బోరు ప్రారంభిస్తే ఎర్రటి కాలుష్య వ్యర్థ జలాలు వెలువడ్డాయి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. సరే.. బోరును  కొన్నిరోజుల పాటు వాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందని నెలరోజులుగా ఆ నీటిని తోడుతున్నారు. అయినా  నీటి రంగులో ఏమాత్రం తేడా లేదు. ఈ ఒక్క సంఘటన చాలు జీడిమెట్ల పారిశ్రామివాడలోని ఫార్మా, రసాయన పరిశ్రమల వల్ల పర్యావరణం ఎంత తీవ్రంగా దెబ్బతిందో చెప్పడానికి.  జీడిమెట్ల పారిశ్రామివాడలోని ఫార్మా, రసాయన పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో దశాబ్దాలుగా ఇష్టానుసారం రసాయనాల వ్యర్థాలను పారబోస్తూనే ఉన్నారు. ఫలితంగా గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఓ వైపు ఘాటైన వాసనలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మరోవైపు కనీసం వాడుకోవడానికి కూడా పనికి రానివిధంగా భూగర్భజలాలు తయారయ్యాయి. ఈ పరిస్థితి కేవలం జీడిమెట్లకే పరిమితం కాలేదు. పటాన్​చెరువు, బొల్లారం, కాటేదాన్​వంటి పారిశ్రామికవాడల్లోనూ ఇదే పరిస్థతి నెలకొంది. ఫలితంగా ఈ ప్రాంతాల ప్రజలు కొత్త కొత్త  వ్యాధులతో హాస్పిటళ్ల పాలవుతున్నారు.

ఈ పాపం కొందరిదే…

నిబంధనల ప్రకారం ఫార్మా కంపెనీల్లో ఉత్పత్తుల అనంతరం వెలువడిన ప్రమాదకర రసాయన వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంది. ఇక్కడే నిర్వాహకులు  అక్కడదారులు తొక్కుతున్నారు. రకరకాల  పద్ధతులను ఎంచుకున్నారు.  బోరుబావులు తవ్వి ప్రమాదకర వ్యర్థరసాయనాలను అందులోకి వదులుతున్నారు. అడవుల్లో పారబోస్తున్నారు. భూమిని తవ్వి అందులో కప్పిపెడుతున్నారు. నాలాల పక్కన ఉన్న పరిశ్రమలతోపాటు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి నాలాల్లో కుమ్మరిస్తున్నారు. మరికొందరు పరిశ్రమల నుంచి నేరుగా నాలాల్లోకి పైపులు వేసి వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా విషతులయ్యమయ్యాయి. ఫలితంగా కొన్ని కాలనీల ప్రజలు ఇంట్లో బోరుబావి ఉన్నా ఆ నీటిని వాడలేని దుస్థితి నెలకొంది. అన్నింటికీ గోదావరి జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. పీసీబీ గట్టి నిఘా, కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే  ఏండ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ఓవైపు పరిశ్రమల యాజమాన్యాలు రసాయనాలను నాలాల్లో గుట్టుచప్పుడు కాకుండా వదులుతూనే ఉన్నాయి. దీంతో ఘాటైన వాసనలతో నాలాలు పొంగి అనేక చోట్ల రసాయనాల నురుగు రోడ్లపైకి వస్తోంది. జేఈటీఎల్​వంటి శుద్ధికేంద్రం పైపులైన్లు పగిలి నాలాల్లో కలుస్తుండటం ఆందోళన కలిగించే అంశం. నెలల తరబడి ఇలా నాలాల్లో రసాయనాల వ్యర్థాలు పారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఒక్కటే దారి…

జీడిమెట్లతోపాటు ఇతర పారిశ్రామికవాడల్లో ఈ దుస్థితి మారాలంటే ఉన్న ఒక్కటే దారి కఠిన చర్యలు తీసుకోవడం. నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం. వ్యర్థాల పారబోతను అరికట్టామని, తగ్గించామని ప్రకటలు ఇచ్చే పీసీబీ అధికారులకు కుత్బుల్లాపూర్​సర్కిల్​ కార్యాలయంలో ఇటీవల వేసిన బోరులో వస్తున్న ఎర్రటి జలాలే సమాధానం చెబుతున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే అరికట్టడంతోనే పరిస్థితులు మెరుగవుతాయంటే అది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. పారబోతను ఆపి ఆ తర్వాత కనీసం ఒకటి, రెండు దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు కష్టపడి పలు రసాయనాలను భూమిలోకి పంపితేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదికూడా పారబోత పూర్తిగా ఆగిన తర్వాతే సాధ్యమంటున్నారు.