అంత ఎమోషనల్గా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీపై విచారణ పిటిషన్పై సీజేఐ !

అంత ఎమోషనల్గా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీపై విచారణ పిటిషన్పై సీజేఐ !

కాక్రోచ్ జనతా పార్టీని అంత ఎమోషనల్గా తీసుకోవద్దని సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్కు సూచించారు. కాక్రోచ్ జనతా పార్టీపై దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించాలని చేసిన పిటిషనర్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

భారత ప్రధాన న్యాయమూర్తి స్పష్టత ఇచ్చినప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వక్రీకరించిన, దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నారని న్యాయవాది ఎన్.కె. గోస్వామి సీజేఐతో అన్నారు. అయితే.. ఈ విషయంలో అంత భావోద్వేగానికి లోను కావద్దని, అత్యవసర విచారణ అవసరం లేదని సీజేఐ సూర్యకాంత్ సదరు న్యాయవాదికి స్పష్టం చేశారు.

నిరుద్యోగం పెరిగిపోతుండటం.. పెరగని జీతాలు.. పడిపోతున్న రూపాయి.. పైకి ఎగబాకుతున్న ధరలు.. మారని బతుకులు.. మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు.. ఎటుచూసినా అవినీతి, అక్రమాలు.. ఒక్కటేమిటి ? దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’.

మహారాష్ట్రకు చెందిన అభిజీత్​ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టిందీ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్​ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్​జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్​లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది.