జల వనరుల శాఖపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

జల వనరుల శాఖపై  సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

నీటి పారుదల శాఖ ఇకపై జల వనరుల శాఖగా..

జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు స‌మావేశంలో తెలిపారు . సాగునీటి వసతులు ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని, మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సీఈలు(చీఫ్ ఇంజినీర్లు) బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సిఇ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హైజులు, కాలువలు, సబ్ స్టేషన్లు అన్ని సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది.

మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనికట్ కు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. పాఖాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయులు నిర్మించిన పాఖాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Chief Minister KCR conducted a review on the reorganization of the Water Resources Department at Pragati Bhavan on Tuesday