పరారీలో చీకోటి ప్రవీణ్ ..రెండు బృందాలు గాలింపు

పరారీలో చీకోటి ప్రవీణ్ ..రెండు బృందాలు గాలింపు

లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్‌ ప్రైవేటు సెక్యూరిటీ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో A1గా ఉన్న చికోటి ప్రవీణ్ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చికోటి ప్రవీణ్ గోవాకు పారిపోయి దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా చికోటి ప్రవీణ్‌ అమ్మవారి ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి భద్రతా సిబ్బంది చికోటి ప్రవీణ్ ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. అంతేకాదు ముగ్గురు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది దగ్గర లైసెన్సు లేని ఆయుధాలు ఉన్నట్లు గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడు(ఏ-1)గా చేర్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రవీణ్ ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు. 

అయితే చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.  చికోటి ప్రవీణ్  ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు రాకేష్ కుమార్, సుందర్ నాయక్, రమేష్ గౌడ్‌లు ఆయుధాలు పట్టుకుని ప్రవీణ్ ఎక్కడికి వెళ్లినా అతని వెంట వస్తున్నారని పోలీసులు రిపోర్టులో ఆరోపించారు. ముగ్గురు నిందితులు A1 (చికోటి ప్రవీణ్)కి సెక్యూరిటీ గార్డులుగా సేవ చేయడానికి అధికారం లేదని తెలియజేశారు. అయితే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు తాను ప్రతిదీ చూసుకుంటానని ఏ1 వారికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.  ముగ్గురు నిందితులు అందుకు అంగీకరించి చికోటి ప్రవీణ్ కు సెక్యూరిటీగా చేరారని  రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 

లాల్ దర్వాజ ఆలయం దగ్గర బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున జనాలు ఉండటంతో ...చికోటి ప్రవీణ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే అతని ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టు ముందు రిపోర్టును సమర్పించారు.  ప్రస్తుతం ప్రవీణ్‌ కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి.