సంవత్సరంపాటు  ఐటీ కారిడార్లో ట్రాఫిక్ డైవర్షన్స్

సంవత్సరంపాటు  ఐటీ కారిడార్లో ట్రాఫిక్ డైవర్షన్స్

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ల నిర్మాణాలను స్పీడప్ చేస్తున్నది. ఈ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఐఐఐటీ జంక్షన్ మార్గంలో ఏడాది పాటు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు నిర్మాణ పనులకు సహకరిస్తూ ఈ ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు కోరారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే: 

గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు.. ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వైపు వెళ్లి, అక్కడ రైట్ టర్న్ తీసుకొని గౌలిదొడ్డి, గోపన్​పల్లి జంక్షన్, నల్లగండ్ల మీదుగా లింగంపల్లికి చేరుకోవాలి.

గోపన్​పల్లి తండా, గౌలిదొడ్డి, క్యూసిటీ, కోకాపేట నుంచి విప్రో జంక్షన్ మీదుగా ఐఐఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు.. విప్రో జంక్షన్ నుంచి నానక్​రాంగూడ రోటరీ-2 వద్ద లెఫ్ట్​టర్న్ తీసుకొని ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్​కు చేరుకోవాలి.

లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు.. హెచ్​సీయూ బస్ డిపో వద్ద ఎడమ వైపునకు తిరిగి మజీద్​బండ, శ్రీరాంనగర్, బొటానికల్ గార్డెన్ జంక్షన్ మీదుగా అంజయ్యనగర్ గుండా గచ్చిబౌలి వైపు చేరుకోవాలి.