బీజేపీ నేత ఇంట్లో అపహరణకు గురైన చిన్నారి

బీజేపీ నేత ఇంట్లో అపహరణకు గురైన చిన్నారి

ఇటీవల మథుర రైల్వే స్టేషన్‌లో అపహరణకు గురైన ఏడు నెలల చిన్నారిని పోలీసులు ఓ బీజేపీ నేత ఇంట్లో గుర్తించారు. అనంతరం మథురకు100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఫిరోజాబాద్‌ లోని బీజేపీ కార్పొరేటర్ ఇంటి నుంచి ఆ చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వేస్టేషన్ లో తల్లి పక్కన నిద్రిస్తున్న ఓ చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు గతవారం రోజుల కింద కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బీజేపీ నేత ఇంట్లో ఆ చిన్నారి లభ్యం కావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అపహరణకు పాల్పడ్డ దుండగులతో బీజేపీ కార్పొరేటర్ వినీతా అగర్వాల్, ఆమె భర్తకు సంబంధం ఉన్నట్టు అధికారులు తేల్చారు. వారికి అప్పటికే ఒక కుమార్తె ఉండగా.. కొడుకు కావాలన్న ఆశతో ఇలా ఆ ముఠా దగ్గర్నుంచి రూ. 1.8 లక్షలకు విక్రయించారని పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఈ కిడ్నాప్ కేసులో 8మందిని అరెస్టు చేయగా.. పిల్లాడిని ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. అనంతరం బీజేపీ నేత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. హత్రాస్ జిల్లాలో ఆసుపత్రిని నడుపుతున్న ఇద్దరు వైద్యులతో కూడిన ముఠాలో మరికొందరు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.