మామిడి పండ్లపై చైనా విషం

మామిడి పండ్లపై చైనా విషం
  • చైనా నుంచి ఇథలీన్ పేరుతో అక్రమంగా దిగుమతి
  • ఈ పౌడర్‌తో 24 గంటల్లోనే కాయలు పండ్లవుతున్నయ్
  • ఇలాంటి పండ్లను తింటే డేంజర్ అంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఎథెఫాన్ పౌడర్ మన మామిడి పండ్లపై విషం కక్కుతోంది. కృత్రిమ పద్ధతుల్లో మామిడి కాయ లను మగ్గపెట్టడానికి వ్యాపారులు దీన్ని వాడుతున్నారు. కాయ పండుగా మారడానికి ఐదారు రోజులు పడుతుంది. కానీ ఈ పౌడర్తో 24 గంటల్లోనే  మామిడి కాయ పండి, నిగనిగలాడే యెల్లో రంగులోకి మారిపోతుంది. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా లాభం కోసం ఇలా చేస్తున్నారు. 
రూట్ మార్చిన వ్యాపారులు
మార్కెట్లలో కార్బైడ్ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఆదేశించడంతో పండ్ల వ్యాపారులు రూట్ మార్చారు. కార్బైడ్ ప్లేస్లో  ఎథెఫాన్  పౌడర్ను మామిడి కాయలు మగ్గపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొన్ని కంపెనీలు చైనా నుంచి ఈ  పౌడర్ను ఇథిలిన్ పేరిట అక్రమంగా దిగుమతి చేసుకొని వ్యాపారులకు సరఫరా చేస్తున్నాయి. వ్యాపారులు ఈ పౌడర్ను కూలీలచేత మార్కెట్ యార్డుల్లో ప్యాక్ చేయిస్తున్నారు. ఒక్కో మామిడికాయల క్రేట్లో ఐదారు ఎథెఫాన్  ప్యాకెట్లు వేస్తున్నారు. హైదరాబాద్లోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఈ తంతు బహిరంగంగానే నడుస్తోంది.మామిడి కాయలను చెట్టుపైనే పక్వానికి వచ్చే వరకు ఆగి తెంపితే సహజ సిద్ధమైన రుచిలో ఉంటాయి. ఒక వేళ దోరగా ఉన్నప్పుడు తెంపినా వరిగడ్డిలో మగ్గబెట్టి సహజ సిద్ధంగా పక్వానికి తేవచ్చు. ఇందుకు కనీసం నాలుగైదు రోజులు టైం పడుతుంది. ఇంత టైం వరకు ఆగలేని వ్యాపారులు అడ్డదారుల తొక్కుతున్నారు. చైనా ఎథెఫాన్  పౌడర్ను  వాడుతున్నారు. ఈ పౌడర్తో 24 గంటల్లోనే కాయలు పండ్లుగా మారుతున్నాయి. పైగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. ప్యాక్ చేసిన ఎథెఫాన్ పౌడర్ ప్యాకెట్లను నీటి బకెట్లలో ముంచి.. తర్వాత ఆ ప్యాకెట్లను కాయల బాక్స్లో వేసి పేపర్లు చుట్టి ప్యాకింగ్ చేస్తుంటారు. నీళ్లు తాకగానే ఎథెఫాన్ పౌడర్లో నుంచి వాయువులు వెలువడతాయి. ఆ వాయువులతో కాయలకు యెల్లో కలర్ వచ్చి పండ్లుగా మారుతాయి.  
ఇథలీన్  రైపనింగ్ చాంబర్స్‌తో మేలు
ఇథలీన్ రైపనింగ్ చాంబర్లో మామిడి కాయలను మగ్గపెడితే మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. కాయలలో హార్మోన్లు సమపాళ్లలో ఉంటాయి. చాంబర్స్లో  12 నుంచి 14 డిగ్రీల టెంపరేచర్లో కాయలు మగ్గపెట్టాలి. ఇలా మగ్గపెట్టడం ద్వారా పండ్లకు ఫంగస్ రాదని హార్టికల్చర్  ఆఫీసర్లు అంటున్నారు. ఇథలీన్ చాంబర్స్లో పండ్లు మగ్గడానికి 72 గంటలు పడుతుంది. రాష్ట్రంలో జగిత్యాలలో, హైదరాబాద్లోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లోనే ఇథలీన్ చాంబర్స్ ఉన్నాయి. ఇథలీన్  రైపనింగ్ చాంబర్లో పండించడం ఖరీదు కావడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. 
నిషేధం ఉన్నా దిగుమతి చేస్తున్నరు
ఎథెఫాన్ను కేవలం పేస్ట్ రూపంలో 10 శాతం, లిక్విడ్ రూపంలో 39 శాతం దిగుమతి చేసుకునే వెసులు బాటు ఉంది. పౌడర్ రూపంలో దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు. కానీ, ఎథెఫాన్  పౌడర్ను ఇథలీన్  పేరుతో కొన్ని కంపెనీలు అక్రమంగా చైనా నుంచి దిగుమతి చేస్తున్నాయి.  రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లలో ఎథెఫాన్ పౌడర్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఏటా చైనా నుంచి రూ. 10 వేల కోట్ల విలువైన ఎథెఫాన్ పౌడర్ మన దేశంలోని మార్కెట్లకు దిగుమతి అవుతోంది. 
పామును జేబులో వేసుకొని తిరుగుతమా: హైకోర్టు
మామిడిపై ఎథెఫాన్ పౌడర్ వాడుతున్నారని, దీన్ని అరికట్టాలని నళిన్ వెంకట కిషోర్, ఎల్. రమేశ్బాబునిరుడు హైకోర్టులో పిల్ వేశారు. అప్పటి చీఫ్ జస్టిస్ చౌహన్  విచారించారు. ‘‘పెస్టిసైడ్ అంటున్నరు.. పర్మిషబుల్ లిమిట్ అంటున్నరు. పాముకు విషం ఉంది కానీ కరువదని ఎవరైనా చెప్తే మనం జేబులో పెట్టుకొని తిరుగుతామా” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ  వ్యవస్థ సరిగా లేదని మండిపడింది.  
సర్కారు యాక్షన్ తీసుకోవాలి
ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఆదేశాలిచ్చి ఎథెఫాన్ పౌడర్ వాడకాన్ని అరికట్టాలని సోషల్ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని ఏలూరులో  600 మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. వీరి ఆరోగ్యం దెబ్బతినడానికి పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, ఆర్గనో క్లోరైన్, ఆర్గనో ఫాస్పేట్ కారణమని ఎయిమ్స్, ఐఐసీటీ, ఎన్ఐఎన్ వంటి సంస్థలు గుర్తించాయని చెప్తున్నారు. ఎథెఫాన్ కూడా ఆర్గనోఫాస్పేట్కు సంబంధించిందేనని, భవిష్యత్లో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సోషల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు. 

ఎథెఫాన్.. యమ డేంజర్ 
ఎథెఫాన్ను మొక్కల పెరుగుదలకు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కెమికల్ను మామిడి కాయలను మగ్గపెట్టడానికి వాడుతుండటంతో ఆ పండ్లను తింటే కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయని అంటున్నారు. 
చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. సహజసిద్ధంగా పండే పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాంటి పోషకాలు ఉంటాయని, కృత్రిమంగా పండించే పండ్లలో పోషకాలు లభించకపోగా అనారోగ్యం కలిగిస్తాయని అంటున్నారు. 

నిబంధనలకు విరుద్ధం

ఎఫ్ఐకే, గోల్డ్ రైప్ అనే కంపెనీలు మేజర్గా చైనా పౌడర్ ఎథెఫాన్ను దిగుమతి చేసుకుని పంపిణీ  చేస్తున్నాయి. ఎథెఫాన్  పౌడర్ను కాయలను మగ్గపెట్టడానికి వాడేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అత్యంత ప్రమాదకరం. - శ్రవంత్ దేవభక్తిని, సోషల్ యాక్టివిస్ట్

లంగ్స్‌కు ఎఫెక్ట్ అవుతది

ఎథెఫాన్ వంటి పెస్టిసైడ్స్తో కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గపెట్టడం సరికాదు. ఇలాంటి పండ్లు తింటే లంగ్స్కు ఎఫెక్ట్ అయి శ్వాస  తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇల్నెస్ నర్వ్ సిస్టమ్పై ప్రభావం చూపుతాయి. . 
-డాక్టర్ నరేశ్, పల్మనాలజిస్ట్ 

తనిఖీలకు ఆదేశించాం

మ్యాంగో రైపనింగ్ ప్రాడక్ట్ లపై ఐపీఎం వాళ్లతో తనిఖీలు చేయాలని ఆదేశించాం. బ్యాన్ చేసిన కార్బైడ్ను వాడకుండా  పూర్తిగా కట్టడి చేశాం. ఎన్రైప్ అనే సాచెట్స్కు మాత్రం గవర్నమెంట్ అనుమతి ఉంది. వాళ్లకు మార్కెట్లో ప్లేస్ కూడా  కేటాయించాం. జగిత్యాల, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఇథలిన్ చాంబర్లు ఉన్నాయి. - లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ డిపార్ట్ మెంట్.

అప్రూవల్ ఉన్న వాటినే వాడాలి

జాతీయ స్థాయిలో ఫుడ్ స్టాండర్డ్స్ నిర్ణయించే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమితి ఉన్న ప్రాడక్ట్స్ మాత్రమే  వాడాలి. అప్రూవల్ ఉన్న ఎన్రైప్ లాంటి నాచురల్ రైపనింగ్ ప్రాడక్ట్స్  వాడొచ్చు. శాస్త్రీయంగా ఇథలీన్ వాయువుతో చాంబర్లలో మగ్గబెడితే పోషక విలువలు ఉంటాయి. అప్రూవల్ లేని చైనా పౌడర్లను అనఫిషియల్గా వాడుతున్నరు. ఇది అత్యంత ప్రమాదకరం.-వెంకట్రామ్ రెడ్డి, డైరెక్టర్, హార్టికల్చర్ 

వృద్ధులకు, పిల్లలకు మరింత డేంజర్
వెజిటబుల్స్, ఫ్రూట్స్ మొక్కలు ఎదగడానికి ఉపయోగించే ఎథెఫాన్ ను మామిడి కాయలను మగ్గపెట్టడానికి  ఉపయోగించడం ప్రమాదకరం. ఇలాంటి పండ్లను తింటే లివర్ డ్యామేజ్ అయినట్లు మెడికల్ రీసెర్చ్లో తేలింది. ఎథెఫాన్తో లంగ్స్కు ఎఫెక్ట్ , స్కిన్ అలర్జీ వంటి వ్యాధులు వస్తాయి. సెన్సిటివ్గా ఉండే వృద్ధులు, పిల్లలకు మరింత ప్రమాదకరం. -డాక్టర్ అగర్వాల్,  సీనియర్ కన్సల్టెంట్