T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే

T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే

భారత టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని తప్పించాలని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక విభాగంలో 'వీసా టు ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్' ఈవెంట్ లో ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయమని మంజ్రేకర్‌ను అడిగారు. అతను ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) ప్రదర్శన ఆధారంగా కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇందులో భాగంగా కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు తన జట్టులో చోటివ్వలేదు. 

రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా.. మూడో స్థానంలో సంజు శాంసన్ ను ఎంపిక చేశాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ లకు చోటిచ్చాడు. ఆశ్చర్యకరంగా లక్నో జట్టులో ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. రాహుల్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా.. జడేజాకు బ్యాకప్ గా కృనాల్ పాండ్యను ఎంపిక చేశాడు. యువ సంచలనం మయాంక్ యాదవ్ కు ఫాస్ట్ బౌలర్ల లిస్టులో ఛాన్స్ ఇచ్చాడు. 12 నెలలుగా టీమిండియా తరపున నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్ ను పక్కన పెట్టేశాడు. కుల్దీప్ యాదవ్, చాహల్ ను ప్రధాన స్పిన్నర్లుగా తన జట్టులో చేర్చాడు.  

మరో నాలుగు రోజుల్లో 15 మందితో  కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీకి ఎవరు సెలక్ట్ అవుతారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. భారత జట్టును ఖరారు చేసేందుకు రోహిత్ శర్మ.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.
  
జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.