సింగపూర్ మోడల్ ఉంటే అభివృద్ధి సాధ్యమే

సింగపూర్ మోడల్ ఉంటే అభివృద్ధి సాధ్యమే

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గతంలో ఏపీ  సీఎం చంద్రబాబు,  తెలంగాణ మాజీ  సీఎం కేసీఆర్  పదేపదే సింగపూర్ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పారు. ఆ నమూనాలో రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తామని  ప్రకటించారు. ముఖ్యమంత్రులను ఆకట్టుకున్న ఆ సింగపూర్ మోడల్ అభివృద్ధి ఏమిటని ఆసక్తి ఉండేది. అయితే,  ఇటీవల ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విషయం ప్రత్యక్షంగా అర్థమైంది. సముద్ర తీరంలో ఉన్న చిన్న దేశం సింగపూర్.

ఒకప్పుడు ఆ దేశ ప్రజలకు తినడానికి సరిపడా ఆహారం కూడా లేని దేశం. సహజ వనరులు లేవు.  వ్యవసాయం లేదు.  పరిశ్రమలు లేవు.  అదే దేశం నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలవడం అనేది సాధారణ విషయం కాదు. అది సింగపూర్ సాధించిన అద్భుత విజయం. సరైన నాయకత్వం  నిజాయితీగా ఉంటే, పాలన క్రమశిక్షణతో సాగితే, వనరులు లేకున్నా అభివృద్ధి సాధ్యమే అని నిరూపించింది సింగపూర్.

అవినీతిపై ఉక్కు పాదం 
లీ కువాన్ యు నేతృత్వంలో 1959లో  పీపుల్స్ యాక్షన్  పార్టీ  అధికారంలోకి  వచ్చిన  తర్వాత  అవినీతిపై  ఉక్కుపాదం  మోపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాటే  వినిపించనివిధంగా వ్యవస్థను మార్చారు. చిన్న తప్పు చేసినా కఠిన శిక్ష తప్పదన్న భయం  అధికారుల్లో  నాటుకుపోయింది. ఫలితంగా, పాలనా యంత్రాంగం ప్రజల సేవలో నిమగ్నమైంది.  ఒకప్పటి  పేద దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశంలో ఒకటిగా  నిలిచింది. సింగపూర్ తలరాతను మార్చింది లీ కువాన్ యు అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

మానవ వనరులే కీలకం
సహజ వనరులు లేని దేశానికి  అత్యంత కీలకమైనది మానవ వనరులే.     విధానాల  రూపకల్పన  మాత్రమే కాదు.. వాటి అమలు శాతం 100% ఉండడమే సింగపూర్ ప్రత్యేకత.  ప్రజలకు అనుకూలంగా మౌలిక వసతులు,  అత్యుత్తమ  ప్రజారవాణా వ్యవస్థ,  అందుబాటులో ఆరోగ్య సేవలు, తక్కువ ఖర్చుతో  విద్య.. ఇవన్నీ సామాజిక సమానత్వానికి నిదర్శనాలు.  సింగపూర్  సమాజాన్ని ముందుకు నడిపించిన  ప్రధాన శక్తి  క్రమశిక్షణ.  తప్పనిసరి  సైనిక శిక్షణ  ద్వారా  ప్రతి పౌరుడిలో  దేశభక్తి,  బాధ్యత  భావనను  పెంపొందించారు. చట్టానికి అందరూ  సమానులనే భావన  అక్కడ  ఆచరణలో  కనిపిస్తుంది. 

ఆర్థిక వ్యవస్థలో స్పష్టమైన దృష్టి
టూరిజం, అంతర్జాతీయ  వాణిజ్యం,  ఎయిర్‌‌‌‌పోర్ట్  సేవలు,  సీ పోర్ట్  ఆధారిత  వ్యాపారాలు.. ఈ నాలుగు రంగాలపై  సింగపూర్ ఆర్థిక వ్యూహం కేంద్రీకృతమైంది. వనరుల లేమిని వ్యూహాత్మక  ప్రణాళికతో అధిగమించారు. సింగపూర్  మోడల్ నుంచి  భారత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశాలు..  అవినీతిపై రాజీలేని పోరాటం,  విధానాల కఠిన అమలు,  ప్రజా ప్రయోజనమే పాలన లక్ష్యం కావాలి,  క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ, నిజాయితీగల  పాలన అందించాలి. సింగపూర్  ప్రపంచంలో  అత్యంత  పరిశుభ్రమైన  నగర  దేశాల్లో  ఒకటిగా గుర్తింపు పొందింది.  ఇది ప్రపంచ పర్యాటకులకు  ఆకర్షణీయ  గమ్యస్థానంగా  మారింది.   పరిశుభ్రమైన పచ్చని వాతావరణం, 

రాజకీయ నాయకుల సాదాసీదా జీవనం
సింగపూర్ రాజకీయ వ్యవస్థలో మరో ప్రత్యేక లక్షణం, నాయకుల సాదాసీదా జీవనం.  సింగపూర్‌‌‌‌లో  రాజకీయ నాయకత్వం వ్యక్తిగత ప్రచారం కంటే  పాలనా సామర్థ్యంతో  గుర్తింపు పొందేవిధంగా మారింది.   సింగపూర్  అభివృద్ధి  ఒక  అద్భుత గాథ మాత్రమే కాదు.  అది ప్రపంచానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం.  పాలకులు సంకల్ప బలంతో, ప్రజల ప్రయోజనమే కేంద్రంగా పాలన చేస్తే అసాధ్యమన్నది ఏదీ లేదు.

శంకర్ శిగ, ఇండిపెండెంట్ జర్నలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.