5 పెండింగ్ కేసుల్లో సీఐడీ చార్జిషీట్లు

5 పెండింగ్ కేసుల్లో సీఐడీ చార్జిషీట్లు

హైదరాబాద్‌, వెలుగు:  గత 13 ఏండ్లుగా పెండిం గ్‌లో ఉన్న5 కీలక కేసుల్లో సీఐడీ పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. నిందితులపై అభియోగాలు నమోదు చేస్తూ వరంగల్ రీజియన్‌ అధికారులు సంబంధిత కోర్టుల్లో చార్జిషీట్లు ఫైల్‌ చేశారు. సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ శుక్రవారం ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఇందులో లజ్జ, శాటానిక్ వర్సెస్ పుస్తకాలను ప్రస్తావిస్తూ ఇస్లాం ఫాసిజంపై క్రిసెంట్ ఓవర్ ది వరల్డ్ పేరుతో బుక్ పబ్లిష్​చేయడంపై 2010లో ఖమ్మం టూ టౌన్‌లో నమోదైన కేసు,2015లో వరంగల్‌ ఎమ్‌జీఎమ్‌ సిలిండర్స్ ఫ్రాడ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 

2016లో భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో నమోదైన శ్రీలంక కిడ్నీ రాకెట్‌ కేసుతో పాటు ఎస్‌సీసీఎల్‌ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్‌, ఎస్‌బీహెచ్‌ కేసముద్రం బ్రాంచ్‌లో జరిగిన రూ.54 లక్షల ముద్ర లోన్ ఫ్రాడ్ కేసులు చాలా కాలంగా పెండింగ్‌ ఉన్నాయి. వీటిలో దర్యాప్తు పూర్తి చేసిన సీఐడీ నిందితులపై అభియోగాలు మోపుతూ తాజాగా చార్జిషీట్లు దాఖలు చేసింది.