దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్​కు చెక్

దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్​కు చెక్

సికింద్రాబాద్, వెలుగు: వంటకాల్లో సుగంధద్రవ్యంగా వాడే దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్​ను నివారించవచ్చని హైదరాబాద్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. దాల్చిన చెక్కలో ఉండే సినమాల్డిహైడ్, ప్రోసైనిడిన్ బీ2 అనే రసాయన పదార్థాలు ఎర్లీ స్టేజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తాయని తేలింది. ‘కీమోప్రివెంటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సినమోన్ అండ్ ఇట్స్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ ఏ ర్యాట్ మోడల్ ఆఫ్ ప్రీమాలిగ్నంట్ ప్రోస్టేట్ కార్సినోజెనిసిస్’ పేరుతో తాము నిర్వహించిన పరిశోధన వివరాలు ‘క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ జర్నల్​లో ఇటీవల ప్రచురితమయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు.

పరిశోధనలో భాగంగా సైంటిస్టులు 10 ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్న ఈ ఎలుకలకు 16 వారాల పాటు ఆహారంలో సినమాల్డిహైడ్, ప్రోసైనిడిన్ బీ2 కాంపౌండ్స్​ను కలిపి అందించారు. తర్వాత వాటిని పరీక్షించగా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు 60%  నుంచి 70% వరకూ తగ్గిపోయాయన్నారు. దాల్చినచెక్కలోని పదార్థాలను ఆహారంలో ఇవ్వడం వల్ల ఆ ఎలుకల్లో ఎముకల క్షీణత కూడా తగ్గినట్లు కనుగొన్నామని ఎన్ఐఎన్ ఎండోక్రైనాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆయేషా ఇస్మాయిల్ వెల్లడించారు. అయితే, ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ కోసం మనుషులకు దాల్చినచెక్కను ఆహారంలో ఇవ్వవచ్చా? అనే విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత అభిప్రాయపడ్డారు.