భోపాల్‌లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

భోపాల్‌లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో అక్రమ డబ్బులను పోలీసులు స్వాధానం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలను గుర్తించారు పోలీసులు సీజ్ చేశారు.  మే 10వ తేదీ శుక్రవారం మధ్యప్రదేశ్, భోపాల్‌లోని పంత్ నగర్ కాలనీలో కైలాష్ ఖత్రీ అనే వ్యక్తి నివాసంలో పోలీసులు సోదాలు జరిపి పెద్ద మొత్తంలో కొత్త, పాత నోట్ల కట్టలను పట్టుకున్నారు. నిందితుడు డబ్బు మార్పిడి వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

భోపాల్ జోన్-1  డీసీపీ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ.. "38 ఏళ్ల కైలాష్ ఖత్రీ అనే వ్యక్తి నివాసం నుండి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.  గత 18 సంవత్సరాలుగా నగదు మార్పిడి వ్వాపారం చేస్తున్నట్లు అతను తెలిపాడు. రూ. 5, రూ. 10 , రూ. 20  డినామినేషన్‌లో చెడిపోయిన నోట్లను సేకరించి.. వాటిపై తన కమీషన్‌ను వసూలు చేసి..  కస్టమర్లకు కొత్త నోట్లను అందిస్తున్నట్లు చెప్పాడు.  సదరు వ్యక్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టల్లో డ్యామేజ్ అయిన నోట్లతోపాటు కొత్త నోట్లు కూడా ఉన్నాయి" అని  తెలిపారు.  డబ్బు మార్పిడి చేసేందుకు అనుమతి ఉన్న ఎలాంటి పత్రాలను చూపించలేదని.. దీంతో అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

సోదాల్లో రికవరీ అయిన డబ్బు గురించి ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం అందించామని.. అయితే, రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు రికవరీ చేసినట్లయితే, దానిని పరిగణలోకి తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ తెలిపిందని డీసీపీ శుక్లా తెలిపారు. దీంతో పట్టబడిన నోట్ల కట్టలను లెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.