వార్డుల అభివృద్ధికి నిధులేవి..చైర్మన్ పై కౌన్సిలర్ల ఆగ్రహం

వార్డుల అభివృద్ధికి నిధులేవి..చైర్మన్ పై  కౌన్సిలర్ల ఆగ్రహం

నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్‌‌‌‌‌‌‌‌ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదంటూ అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు శుక్రవారం క్యాంప్‌‌‌‌‌‌‌‌నకు తరలివెళ్లారు. శనివారం మున్సిపల్​ సర్వసభ్య సమావేశం ఉన్నందున ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌ను బైకాట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకే పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లోని విజయవిహార్‌‌‌‌‌‌‌‌ హాటల్‌‌‌‌‌‌‌‌లో బస చేసినట్లు ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత చెప్పారు. వార్డుల అభివృద్ధికి నయాపైసా ఇవ్వడం లేదని, దత్తత పట్టణమైన నల్గొండలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ లైటింగ్‌‌‌‌‌‌‌‌ పనులు తప్ప వార్డుల గురించి పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రగతి కింద వచ్చే నిధులను వార్డులకు కేటాయించేవారని, కానీ ఇప్పుడు ఆ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కూడా రోడ్ల పనులు, అర్బన్‌‌‌‌‌‌‌‌ పార్కులకే ఖర్చు పెడుతున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పన్నులు, పట్టణ ప్రగతి నిధులను లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తున్నారన్నారు. పాలకవర్గంలో చర్చించకుండా, తనిఖీలు లేకుండా వచ్చిన ప్రతి పైసాను రోడ్లు, పార్కులకే పెట్టడం వల్ల వార్డుల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రిపేర్లకు పైసా ఉండడం లేదన్నారు. సీఎంతో మాట్లాడి వార్డుకు రూ. కోటి ఇప్పిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదని, దీంతో వార్డుల్లో జనాలకు ముఖం చూపించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్లు క్యాంప్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.