రేవంత్​ Vs​ సీనియర్లు..కాంగ్రెస్​లో కయ్యం

రేవంత్​ Vs​ సీనియర్లు..కాంగ్రెస్​లో కయ్యం
  • గతంలో ఉత్తమ్, రేవంత్ మధ్య సైలెంట్ వార్
  • తాజాగా మరోసారి రచ్చకెక్కిన నేతలు..
  • పార్టీ వీడుతానంటూ జగ్గారెడ్డి బెదిరింపులు
  • సర్దిచెప్పలేకపోతున్న మాణిక్కం ఠాగూర్

ఒక్కొక్కరూ దూరం


పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించినప్పటి నుంచి నేతల మధ్య విబేధాలు తరచూ బయటపడుతున్నాయి. తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని, పార్టీ టీడీపీ కాంగ్రెస్‌‌‌‌గా మారిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్​కు ముందు నుంచీ పడ్తలేదు. రేవంత్‌‌‌‌కి తొలి రోజుల్లో మద్దతుగా నిలిచిన ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తర్వాత దూరమయ్యారు. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేల్లో సీతక్క ఒక్కరే రేవంత్‌‌‌‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పీసీసీ అనుబంధ విభాగాలు కూడా చీలిపోయాయి.

హైదరాబాద్, వెలుగు: కుమ్ములాటలు.. గ్రూప్ రాజకీయాలు.. సొంత పార్టీ నేతలపైనే బహిరంగ విమర్శలు.. ఎవరి దారి వాళ్లది.. ఎవరి స్కెచ్‌‌‌‌లు వాళ్లవి.. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన హస్తం పార్టీ.. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నది. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కుదేలవుతున్నది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఇది మరింతగా ముదిరింది. ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి, అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. రేవంత్‌‌‌‌కు వ్యతిరేకంగా ఒకరి తర్వాత ఒకరు గళం విప్పుతున్నారు. నేతల మధ్య వివాదాలు, విమర్శలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
రేవంత్‌‌‌‌ను కార్నర్ చేసేలా..
తాజాగా రేవంత్‌‌‌‌ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్న ఫైట్ కాంగ్రెస్‌‌‌‌లోని విభేదాలను బయటపెట్టింది. కరోనాతో రేవంత్ ఐసోలేషన్‌‌‌‌లో ఉండగా.. గురువారం గాంధీభవన్ వేదికగా ఇతర నేతలు హడావుడి చేశారు. కొన్ని నెలల తర్వాత గాంధీభవన్‌‌‌‌కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి.. వనమా రాఘవ ఇష్యూపై మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. 


సాధారణంగా సీఎల్పీ కేంద్రంగా ప్రెస్ మీట్లు పెట్టే భట్టి విక్రమార్క.. మధుయాష్కీ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంభాని చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట అన్వేష్ రెడ్డిలతో కలిసి ఖమ్మం అంశంపై మీడియాతో మాట్లాడారు. తర్వాత భట్టి సీఎల్పీకి వెళ్లి.. గీతారెడ్డి, శ్రీధర్ బాబు, మహేశ్వర్‌‌ రెడ్డితో కలిసి జగ్గారెడ్డితో మాట్లాడారు. పార్టీ వీడుతానని జగ్గారెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆయన్ను అనునయించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారాలతో రేవంత్ కార్నర్ అయినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
 

రచ్చబండతో రచ్చ.. కాక రేపిన జగ్గారెడ్డి


ఉమ్మడి మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ ప్రోగ్రామ్‌తో జగ్గారెడ్డి ఫైట్ మొదలైంది. రేవంత్‌ని మార్చమని సోనియాకు జగ్గారెడ్డి లేఖ రాయడం, చిన్నారెడ్డి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ జగ్గారెడ్డిని వివరణ కోరుతామని అనడం.. గొడవను మరింత పెద్దది చేసింది. దాంతో బుధవారం జూమ్‌లో జరిగిన పీఏసీ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. జగ్గారెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా మద్దతుగా నిలిచారు. రేవంత్‌కు గట్టి మద్దతుదారుడైన రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి తలపట్టుకోవాల్సి వచ్చింది. పార్టీలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్‌కు చెబుతూనే.. పార్టీ వ్యవహారాలను మీడియా ముందు చర్చించవద్దని డిసిప్లినరీ కమిటీకి, జగ్గారెడ్డికి హితవు పలికారు. కానీ వెనక్కి తగ్గని జగ్గారెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. ‘‘పార్టీలో నా నోరు మూయించే శక్తి ఎవరికీ లేదు” అని అన్నారు. సోనియా, రాహుల్​ను కలిసే ప్రయత్నం చేస్తున్నానని, ఢిల్లీ నుంచి వచ్చాక తన మనసులో మాట చెబుతానని చెప్పారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని నేతలు అంటున్నారు.