V6 News

16 నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ పర్యటన

16 నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ పర్యటన
  • సర్కారు తప్పిదాలను ఎండగడుతాం: భట్టి విక్రమార్క
  • టీఆర్ఎస్‌‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
  • మునుగోడులో భారీ మెజారిటీ ఖాయమని ధీమా

హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పోరాట స్ఫూర్తిని తలుచుకుంటూ జిల్లాల్లో మంగళవారం నుంచి ఆజాదీ గౌరవ్ యాత్రలు నిర్వహిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాలు వారం రోజులు జరుగుతాయన్నారు. ఇటీవలి వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో 16వ తేదీ నుంచి పర్యటిస్తామని చెప్పారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో భట్టి ఆధ్వర్యంలో కాంగ్రె స్ ప్రజాప్రతినిధులతో జూమ్ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్​బాబు, సీతక్క, పోదెం వీరయ్య ఇందులో పాల్గొన్నారు. కాళేశ్వరం ముంపు, సీతాసాగర్​, సీతారామ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని భేటీలో నిర్ణయించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్‌‌తో సీఎల్పీ విజిట్ సాగుతుందని భట్టి తెలిపారు. 16న భద్రాచలం, 17న కాళేశ్వరం, చెన్నూరు, మంచిర్యాల, 18న కడెం, కుమ్రంభీమ్ ఏరియాల్లో సందర్శిస్తామని వివరించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ తప్పిదాలను వివరించి చెబుతామన్నారు. పంట, ఆస్తి, పశు, మత్స్య సంపద నష్టాన్ని అంచనా వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు.

మునుగోడులో కాంగ్రెస్సే గెలుస్తది

ఆజాదీ గౌరవ్ యాత్రలో భాగంగా నాటి స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర, దేశం కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలను నేటి తరానికి చాటి చెబుతామని భట్టి విక్రమార్క చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. అయితే అక్కడ గెలిచేది మాత్రం కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. తమకు భారీ మెజారిటీ వస్తుందన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ తీసుకువచ్చిన ఐటీఐఆర్​ ప్రాజెక్టును రద్దు చేసినందుకు ఓటు వేయాలా? కాంగ్రెస్​ హయాంలో వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నందుకు ఓటు వేయాలా? నిత్యావసర వస్తువుల ధరలు భారీ ఎత్తున పెంచినందుకు మోడీకి ఓటేయమంటారా?” అని ప్రశ్నించారు. గోవులాంటి కాంగ్రెస్‌‌ను వదిలి, పులిలాంటి బీజేపీలో చేరడం ప్రమాదమని రాజగోపాల్‌‌ను హెచ్చరించారు.