V6 News

మీ డేటా భద్రంగా ఉంటది.. నాది భరోసా: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు

మీ డేటా భద్రంగా ఉంటది.. నాది భరోసా: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన జనగణన (2026-27) కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. మీ డేటా భద్రంగా ఉంటుందని.. ఇందుకు నాది భరోసా అని అన్నారు. జనగణనలో అధికారులకు ప్రజలు తమ కచ్చితమైన వివరాలు అందించాలని సూచించారు. ఆదివారం (ఏప్రిల్ 26) తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోన్న జనగణన (2026-27) కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

‘‘జాతీయ జనాభా లెక్కలు కేవలం ప్రభుత్వ పని కాదు. ఇది మనందరి బాధ్యత. మీ భాగస్వామ్యం కీలకం. మీరు అందించే సమాచారం పూర్తిగా భద్రంగా, గోప్యంగా ఉంచబడుతుంది. 2027 జనాభా లెక్కలను విజయవంతం చేద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రజలు తమ సమాచారాన్ని స్వయంగా కూడా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. గణన అధికారులు మీ ఇంటికి రావడానికి 15 రోజుల ముందు నుంచే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్వీయగణన పూర్తి చేసిన తర్వాత ఇమెయిల్ లేదా మొబైల్‌లో ఒక ప్రత్యేక ఐడీ వస్తుందని, ప్రజలు తమ వివరాలను ధృవీకరించుకోవడానికి దానిని సిబ్బందికి చూపించవచ్చన్నారు.

బుద్ధుడి బోదనల స్మరణ

మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్‌లో జనగణనతో పాటు పలు అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఉద్దేశిస్తూ ప్రపంచ అనిశ్చితి నడుమ బుద్ధ భగవానుడి బోదనలు స్మరించుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల వేళ బుద్ధుని బోధనలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. బుద్ధ భగవానుని బోధనలను ప్రపంచం అనుసరించాలని కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు. బుద్ధుని బోధనలు ప్రజలు ప్రకృతితో మమేకమై ఉండటానికి కూడా సహాయపడతాయని పేర్కొన్నారు.