మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో అనాథ చిన్నారులకు సీఎం ప్రజావాణి అండ

మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో అనాథ చిన్నారులకు సీఎం ప్రజావాణి అండ
  •     ఆర్థిక సాయంతో పాటు పిల్లలకు పాలు అందించాలని  ఆదిలాబాద్​ కలెక్టర్​కు ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన గిరిజన తోటి కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి ఆదిలాబాద్  జిల్లా ఉట్నూరు మండలం రాంజీ గోండు నగర్ కు చెందిన అనాథ పిల్లలను వారి బంధువులు తీసుకువచ్చారు. రెండేండ్లు, మూడు నెలల చిన్నారుల పోషణ కష్టంగా ఉందని వారి సంరక్షణ చూస్తున్న పెదనాన్న, పెద్దమ్మ ఆత్రం సునీత, వెంకటి ప్రజావాణి ఇన్​చార్జి చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 

స్పందించిన ఆయన ఇద్దరు చిన్నారులకు స్పాన్సర్షిప్  అందించాలని ఆదిలాబాద్  కలెక్టర్ కు లెటర్​ రాశారు. రాంజీ గోండు నగర్ కు చెందిన ఆత్రం విఠల్, గంగుబాయి 6 నెలల వ్యవధిలో చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఆ చిన్నారుల బాధ్యతను పెదనాన్న, పెద్దమ్మ చూస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని కనీసం డబ్బా పాలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆర్థికసాయంతో పాటు చిన్నారులకు డబ్బా పాలను అందించే బాధ్యత తీసుకోవాలని ఆదిలాబాద్  కలెక్టర్ కు చిన్నారెడ్డి సూచించారు.