పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ( జూన్ 5 ) పలు ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం రేవంత్ ఉద్దండాపూర్ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పాదయాత్ర కాదు.. పొర్లుదండాలు చేసినా బీఆర్ఎస్ పాపాలు పోవని అన్నారు.
కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఆదరించారని... పాలమూరు ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. పదేళ్లు రూ.8 లక్షల కోట్లు చేతికిస్తే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కేసీఆర్ పూర్తి చేయలేదని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనలో నష్టపోయిన జిల్లా ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు.2009లో కరీంనగర్ లో ఓడిపోతానని పాలమూరుకు వచ్చి కేసీఆర్ గెలిచారని అన్నారు సీఎం రేవంత్.
వలసల గోస తీర్చుతానని.. కేసీఆర్ పచ్చి మోసం చేశారని అన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి ఐదుసార్లు కూడా పాలమూరుకు రాలేదని అన్నారు.ఏపీలో పార్టీ చచ్చిపోయినా... సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని... గొర్రె కసాయోడిని నమ్మినట్లు జనం కేసీఆర్ ను రెండుసార్లు సీఎం చేశారని అన్నారు సీఎం రేవంత్. పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయలేదని.. పాలమూరుకు సాగునీరు, తాగునీరు రాలేదని అన్నారు.
