హెల్త్, ఎడ్యుకేషన్​ రంగాల అభివృద్ధికి నిధులివ్వండి: సీఎం రేవంత్

హెల్త్, ఎడ్యుకేషన్​ రంగాల అభివృద్ధికి నిధులివ్వండి: సీఎం రేవంత్
  •  
  • 16వ ఆర్థిక సంఘంలోరాష్ట్రానికి ఫండ్స్ పెంచండి 
  • నీతి ఆయోగ్​ టీమ్​కుసీఎం రేవంత్ వినతి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర విద్య, వైద్య రంగాల్లో  సౌలతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్​ బృందాన్ని సీఎం రేవంత్​ రెడ్డి  కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి బృందం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి నీతి ఆయోగ్​ టీమ్ తో  సీఎం రేవంత్  రెడ్డి చర్చించారు. రాబోయే16వ ఆర్థిక సంఘం ద్వారా  రాష్ట్రానికి నిధుల కేటాయింపులు పెరిగేలా చూడాలని సీఎం కోరారు.  గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు సహకారం అందించాలన్నారు. హైదరాబాద్​ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేసే రోడ్​ మ్యాప్​కు మద్దతు అందించాలని తెలిపారు. నమామి గంగే తరహాలో మూసీ అభివృద్ధికి సాంకేతిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి పెండింగ్​లో ఉన్న రూ.1800 కోట్ల గ్రాంట్లను కేంద్రం విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో  స్టేట్ ఇనిస్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ ఫర్మేషన్ (ఎస్ఐటీ)ను  ఏర్పాటు చేయాలని కోరారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్  పాలక మండలిలో  తెలంగాణ భాగస్వామ్యం కావాలని..రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా సహకారమందిస్తామని నీతి ఆయోగ్ తెలిపింది.నీతి ఆయోగ్ కు నిర్మాణాత్మక మద్దతు, సహకారం అందిస్తామని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. సమావేశంలో  నీతి ఆయోగ్ సభ్యుడు విజయ్​ కుమార్, డైరెక్టర్ జనరల్  సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేశ్ డాష్, ముత్తు కుమార్ , సీఎస్​ శాంతికుమారి, స్పెషల్​ సీఎస్​ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.