- కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, కేసీ వేణుగోపాల్‌కు సీఎం వివరణ
న్యూఢిల్లీ, వెలుగు: పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపల్ ఎలక్షన్స్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయానికి సంబంధించిన రిపోర్ట్‌ను వారికి అందజేశారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై వివరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని వివరించారు.
అలాగే, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరిగాయని.. శుక్రవారం ఆ ఫలితాలు వెలువడనున్నాయని తెలియజేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్‌లాంటి స్కీమ్స్ అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నదని రాహుల్, కేసీకి రేవంత్ వివరించారు.
ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటులాంటి అభివృద్ధి పనుల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రెండేండ్లలో చేసిన పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్రనేతలకు రేవంత్‌రెడ్డి వివరించారు. క్షేత్రస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై సీఎం రేవంత్‌ను రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ అభినందించారు.
