పాలమూరు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • భూసేకరణపై స్పెషల్ ​ఫోకస్ ​పెట్టండి: సీఎం రేవంత్​
  • అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తం
  • ఆరు నెలల్లో కర్వెన రిజర్వాయర్​కు కృష్ణా జలాలు తేవాలి
  • ఇరిగేషన్​ అధికారులు, కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు
  • ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై 3 గంటలపాటు సమీక్ష
  • ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా చర్చ
  • బెంగళూరు నుంచి హెలికాప్టర్​లో నేరుగా మక్తల్ చేరుకున్న సీఎం
  • మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్​ స్కీమ్, గూడెందొడ్డి పంపు హౌస్ పరిశీలన
  • భీమా, కృష్ణా నదులపై బ్యారేజీల ప్రతిపాదిత స్థలాల్లో ఏరియల్ ​వ్యూ

నాగర్​కర్నూల్​/ మక్తల్/గద్వాల, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని  అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి భూసేకరణ అత్యంత ప్రధానమన్న సీఎం.. ఇందుకోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ స్కీములోని నాలుగో రిజర్వాయర్​కర్వెనను ఆరు నెలల్లో కృష్ణా జలాలతో నింపాలని సీఎం ఆదేశించారు. 

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన కోసం రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి.. టూరిజం గెస్ట్​హౌస్​లో మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్​, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

దాదాపు మూడు గంటలపాటు సాగిన రివ్యూలో ఇరిగేషన్​అధికారులు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, మక్తల్– నారాయణపేట– కొడంగల్ లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీమ్(ఎంఎన్​కేఎల్​ఐఎస్)​, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్యాకేజీల వారీగా సీఎం సమీక్షించారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి భూ సేకరణ అతికీలకమని చెప్పారు.  స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లాల కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.

భూసేకరణకు  అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి, విప్​ ఎన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్​రెడ్డి, రాజేశ్​​ రెడ్డి, డా.వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, అనిరుద్​రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్​, ఏపీ జితేందర్​ రెడ్డి, ప్రభుత్వ సాగునీటి సలహాదరు ఆదిత్యనాథ్​ దాస్, ఇరిగేషన్​ కార్యదర్శి శ్రీధర్​,ఇఎన్​సీలు, సీఈలు,ఎస్ ఈలు, కలెక్టర్లు పాల్గొన్నారు.

ఎంఎన్​కేఎల్​ఐఎస్​ ప్యాకేజీ-1 పనుల పరిశీలన.. 

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్​ ప్రాజెక్టుల పరిశీలన ఉత్సాహంగా సాగింది. ఒక్కో ప్రాజెక్టు దగ్గర ఆయన దాదాపు 20 నిమిషాలు గడిపారు. ఆయా ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతిని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు. 

అక్కడే ఏర్పాటు చేసిన ఎంఎన్​కే ఎల్ఐఎస్, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్​ను తిలకించారు. ఈ ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ ఆఫీసర్లు మ్యాపులతో సీఎంకు వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్​లో సీఎం మక్తల్ మండలం కాట్రేవుపల్లి దగ్గర కొనసాగుతున్న ఎంఎన్ కేఎల్​ఐఎస్ ప్యాకేజీ-1 సైట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పనులను పరిశీలించారు. ప్యాకేజీ--1 లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్ పనులు ఏ మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

అనంతరం హెలికాప్టర్​లో కోయిల్​సాగర్, భీమా, కృష్ణా నదులపై నిర్మించనున్న రోడ్ కం బ్యారేజ్​ ప్రతిపాదిత ప్రాంతాల ఏరియల్​వ్యూ నిర్వహించారు. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు.

 సోమశిలలో రాత్రి బస.. 

సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడు లిఫ్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి పంప్ హౌస్ ను సీఎం పరిశీలించారు. జూరాల ప్రాజెక్టును హెలికాప్టర్​ ద్వారా పరిశీలించారు. మక్తల్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి హెలికాప్టర్ లో గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ దగ్గర హెలిప్యాడ్ దగ్గరికి వచ్చారు. 

అనంతరం గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి.. కాన్వాయ్ ద్వారా గుడ్డెందొడ్డి పంప్ హౌస్ దగ్గరకు చేరుకున్నారు. ముందుగా జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఆ తర్వాత పంప్ హౌస్ పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన నడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ ను తిలకించారు. అక్కడి నుంచి నేరుగా సోమశిల కు వెళ్లి.. అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం అక్కడే బస చేశారు.