కీలక ప్రాజెక్టులకు నిధులెట్ల.?..కేంద్రం సహాయ నిరాకరణపై సీఎం అసంతృప్తి

కీలక ప్రాజెక్టులకు నిధులెట్ల.?..కేంద్రం సహాయ నిరాకరణపై సీఎం అసంతృప్తి
  • కేంద్ర బడ్జెట్‌‌‌‌లో ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌, మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ 
  • ప్రస్తావన లేకపోవడంపై సీఎం రేవంత్‌‌‌‌ అసంతృప్తి
  • ఫైనాన్స్​ అధికారులతో సమాలోచనలు
  • సొంతంగా నిధుల సమీకరణపై ఫోకస్​
  • ఇందుకోసం యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేయాలని ఆదేశం
  • రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేమెగా ప్రాజెక్టులను ఎలాగైనా 
  • ముందుకు తీసుకెళ్లాల్సిందేనని అధికారులకు సూచన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌ ఆర్),  మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​ స్కూల్స్‌‌‌‌లాంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం ‘సహాయ’ నిరాకరణపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.  కేంద్ర బడ్జెట్‌‌‌‌లో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కనీస ప్రస్తావన లేకపోవడం, నయా పైసా కేటాయించకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణపై ఫోకస్​ పెట్టారు. యూఎస్​ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్న  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి.. అదే రోజు రాత్రి కేంద్ర బడ్జెట్‌‌‌‌పై సీఎస్​, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే వాటా నిధులపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పూర్తిగా విస్మరించడం, కనీసం అనుమతులు కూడా ఇవ్వకపోవడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడ్డట్లు తెలిసింది.  కేంద్రం సహకరించకపోయినా ఆయా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని,  నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలతో  యాక్షన్​ ప్లాన్​ రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతం అప్పుల సమస్య వేధిస్తున్నది. గత సర్కారు చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీల చెల్లింపులకోసం తిరిగి అప్పులు చేయాల్సి వస్తున్నది. దీంతో కొత్త ప్రాజెక్టులను నిధుల సమస్య వెంటాడుతున్నది.  ఏటా కనీసం రూ.65 వేల కోట్లు అప్పుల కిస్తీలు, వడ్డీలకే పోతున్నాయని, అదే సమయంలో  ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతున్నాయని సీఎం రేవంత్‌కు అధికారులు వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టులు ఆగిపోకూడదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధుల సమీకరణపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం  సూచించారు. ఇందుకోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, అవసరమైతే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.  హడ్కో, జైకా, ప్రపంచ బ్యాంకులాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి, తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశాలపై కసరత్తు ముమ్మరం చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారా లేదంటే ఆస్తుల విక్రయం ద్వారా కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా రాబోయే రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ పనులు అత్యంత ఆవశ్యకమని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదని  సీఎం చెప్పినట్లు తెలిసింది.  పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలోనైనా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పినట్లు సమాచారం. ఆయా ప్రాజెక్టులకు గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, వెంటనే విధివిధానాలు ఖరారు చేయాలని, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

సీఎస్‌ఎస్​ పథకాలకు రూ.25 వేల కోట్లు: సీఎస్​

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని   సీఎస్​ కె. రామకృష్ణా రావు పేర్కొన్నారు.  సెక్రటేరియెట్‌లోని వివిధ శాఖల కార్యదర్శులతో మంగళవారం సీఎస్​ సమీక్ష నిర్వహించారు.   కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఎస్ఎస్​ కింద రూ.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో ప్రతి పాదించిందని,  జనాభా ప్రాతిపదికగా తెలంగాణకు కనీసం రూ.25 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.  కేంద్ర బడ్జెట్‌లో ఫార్మా  రంగ అభివృద్ధి, సెమీ కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని, ఈదిశగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఖమ్మం, వరంగల్ కరీంనగర్ జిల్లాను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి అవకాశం ఉందని, ఇందులో భాగంగా వరంగల్ లో మామునూరు ఎయిర్‌‌పోర్ట్  కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి గణనీయమైన అవకాశం ఉందని చెప్పారు. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో రూ.10  వేల కోట్లు రావాల్సి ఉందని, ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. 16 ఆర్థిక సంఘంలో భాగంగా 2011 జనాభా ప్రాతి పదికపై నిధుల మంజూరు ఉంటుందని, దీనితో పాటు డెమోగ్రాఫిక్ ఏరియా, పథకాల అమలు సామ ర్థ్యం, నిధుల వినియోగం లాంటి ప్రాతిపదికలపై కూడా కేటాయింపులు ఉంటాయని వివరించారు. ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదిక ప్రకారం నిధుల కేటాయింపునకు ప్రాధా న్యనిచ్చారని సీఎస్​ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో వినియోగం కాకుండా ఉన్న మిగులు నిధులను రాష్ట్రానికి దక్కేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్​ సీఎస్​ సీవీ ఆనంద్, వికాస్ రాజ్, సంజయ్ కుమార్,  జయేశ్‌ రంజన్, సవ్యసాచి ఘోష్, అహ్మద్ నదీమ్,  ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్​  సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్. శ్రీధర్, వివిధ శాఖల  కార్యదర్శులు పాల్గొన్నారు. 

పైసా పెట్టలే.. పర్మిషన్లు ఇస్తలే.. 

ట్రిపుల్‌ ఆర్‌‌ నార్త్‌ భాగానికి సంబంధించి దాదాపు భూసేకరణ పూర్తయింది. కానీ, నిర్మాణానికి సంబంధించిన టెండర్​ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణ కొనసాగుతున్నది. హైదరాబాద్ చుట్టూ సుమారు 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ అనుమతులతోపాటు కేంద్రం వంతుగా రూ.34,367 కోట్లు  ఆర్థిక సహాయం  అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఇంకా ఆమోదం తెలుపలేదు. అక్కడి నుంచి పర్మిషన్​ వస్తే కానీ ఇక్కడ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వమే హ్యామ్ లేదా ఇతర పద్ధతుల్లో ట్రిపుల్‌ ఆర్‌‌​ నిర్మించాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. కానీ, ఈ కీలక ప్రాజెక్టుకు గ్రీన్​ సిగ్నల్​ రాకపోవడంపై సీఎం రేవంత్  అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నుంచి 4  ఏండ్లలోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించామని, కానీ అనుమతులకే రెండున్నరేండ్లు గడిచిపోతున్నాయని,  మరో రెండేండ్లలో ట్రిపుల్‌ ఆర్‌‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లతో సీఎం అన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్రం అనుమతుల కోసం సీరియస్​ఎఫర్ట్​పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక  హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా మెట్రో రైలు ఫేజ్–2 ప్రాజెక్టు, ఫేజ్ 2ఏ,  ఫేజ్ 2బీ  ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.  మొత్తం రూ.44,028 కోట్లు అవసరం కానున్నాయని, హైదరాబాద్​మెట్రోకు అనుమతిస్తే కేంద్రం భరించాల్సింది  కేవలం18 శాతంనిధులేనని.. ఆ మాత్రం ఇవ్వడం ఇష్టంలేకే ఫైల్​ పక్కనపెడ్తున్నదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అదే ఏపీలో మాత్రం గతంలో ఒకేసారి వైజాగ్​,విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వడంతోపాటు 50 శాతం నిధులను భరించేలా ముందుకు వచ్చిందని సీఎం గుర్తుచేసినట్లు సమాచారం. ఇక మూసీ పునరుజ్జీవనం కోసం డీపీఆర్‌‌లు పూర్తి చేయడం, ఏసియన్ డెవలప్‌మెంట్‌​ బ్యాంక్ కూడా రుణానికి ముందుకు వచ్చింది. కానీ కేంద్రం అదనపు కనీసం రుణ సమీకరణకు కూడా సహకరించలేదని, గోదావరి–మూసీ అనుసంధానం కోసం  రూ.6 వేల కోట్లు అడిగితే దానిని కూడా పట్టించుకోలేదని సీఎం అన్నట్లు తెలుస్తున్నది.