నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్థుల భవిష్యత్ ను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నీట్ రద్దుతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్ ను ఆగం చేశారని మండిపడ్డారు. జాతీయ పరీక్షల విశ్వసనీయతను కాపాడాలని రేవంత్ సూచించారు. పేపర్లు లీక్ చేసిన వ్యక్తులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లీక్ చేసినోళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని అన్నారు.పేపర్ లీక్ పై కేంద్రం సమగ్ర విచారణ చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రేవంత్ . వైఫల్యాలు, ద్రోహం, వ్యవస్థీకృత అవినీతి ఈ మూడింటిలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్పష్టమైన సారూప్యతలు కనిపిస్తున్నాయన్నారు.
‘మే 3న దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో.. సుమారు 22 లక్షల 79 వేల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పరీక్ష రాశారు. కానీ పేపర్ లీక్‌లు, పరీక్షా ప్రక్రియలో జరిగిన తీవ్రమైన అవకతవకల వల్ల నేడు వారంతా మళ్లీ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఈ పేపర్ లీక్‌ల వెనుక ఈ అవినీతి వెనుక ఏ వ్యక్తులు ఉన్నా.. ఏ నెట్‌వర్క్‌లు ఉన్నా.. వారి పలుకుబడి ఎంతటిదైనా, హోదా ఏపాటిదైనా.. వారిని వదిలిపెట్టొద్దు..వారిని కఠినంగా శిక్షించాల్సిందే.
►ALSO READ | వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం: లాక్ డౌన్ కు మొదటి అడుగు పడిందా..!
ఈ సంక్షోభంలో చిక్కుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి తెలంగాణ ప్రభుత్వం దృఢంగా అండగా నిలుస్తుంది. వ్యవస్థాగత వైఫల్యాల వల్ల అమాయక విద్యార్థులు పదేపదే బలి కాకూడదు. అందుకే.. పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన, నమ్మదగిన విచారణ జరపాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ పరీక్షల ఏజెన్సీని డిమాండ్ చేస్తున్నాము. ఒక నీట్ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో త్యాగం చేస్తారు.. మానసిక ఒత్తిడిని భరిస్తారు.. ఆర్థిక భారాన్ని మోస్తారు. పోటీ పరీక్షలు అనేవి ఆందోళనకు చిరునామా కాకూడదు.. అవి ప్రతిభకు, అవకాశాలకు సాధనాలుగా మారాలి’.అని రేవంత్ తెలిపారు.
