- కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించాలి
- మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్
వేములవాడ, వెలుగు : వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్ చెప్పారు. వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... కాంగ్రెస్ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకొచ్చే విషయంపై విప్ ఆది శ్రీనివాస్ సీఎంతో మాట్లాడనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వేములవాడ వచ్చి యార్న్ డిపో ఓపెన్ చేశారని, చేనేత కార్మికుల కోసం రూ. 1100 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రూ. 21 వేల కోట్ల రైతు, చేనేత కార్మికుల రుణమాఫీ కూడా చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సే అన్నారు. కోటి మంది మహిళలను చీరలు తయారు చేసి ఇచ్చే బాధ్యతను జిల్లా చేనేత కార్మికులకే ఇచ్చామన్నారు
అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి పరుగులు
కరీంనగర్, వెలుగు : ‘కాంగ్రెస్‌కు మేయర్ పీఠం అప్పగిస్తే కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం, అధికార పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫ్రీ కరెంట్, మహిళలకు ఫ్రీ బస్, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని పలు డివిజన్లలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మాజీ మంత్రి గంగుల కమలాకర్ పదేండ్లలో ఒక్కరికైనా డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల భూఆక్రమణలకు కరీంనగర్ వేదికగా మారిందని, ఎంతో మంది కార్పొరేటర్లు జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎన్నికల కోఆర్డినేటర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
