- నిర్ణయాలు తీసుకుంటే కుదరదు
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
- సీట్ల కేటాయింపులో 50:50 ఫార్ములా.. ‘హైబ్రీడ్ మోడల్’ అమలు చేయాల్సిందే
- 543 సీట్లలోనే మహిళా కోటా ఇవ్వండి.. సీట్ల పెంపుతో ముడిపెట్టి కాలయాపన వద్దు
- ప్రాంతీయ విభేదాలు రానివ్వొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును దక్షిణాదిరాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా నియం త్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ‘హైబ్రీడ్ మోడల్’ అమలు చేయాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా కోటా అనేవి వేర్వే రు అంశాలని వాటిని ముడిపెట్టవద్దని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. 850 సీట్లకు పెంచే క్రమంలో సగం సీట్లను జనాభా ప్రాతిపదికన, మిగిలిన సగం రాష్ట్రాల ఆర్థిక సహకారం ఆధారంగా కేటాయించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఈ కోటాను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అందరితో చర్చించాలని కోరారు. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీల అభిప్రాయాలు తీసు కోవాలన్నారు. నియోజకవర్గాల సరిహద్దుల మార్పు కోసం చేసే డీలిమిటేషన్ ప్రక్రియకు తమ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం సరిహద్దులను సవరించే ప్రక్రియను దేశం గతంలోనూ చేపట్టిందని గుర్తుచేశారు. కానీ, మహిళా రిజర్వేషన్లను సీట్ల పెంపుతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో అనవసర అయోమయం నెలకొంటోందని చెప్పారు. లోక్సభ స్థానాలను జనాభా ప్రాతిపదికన 850కి పెంచాలనే ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి గొప్ప నేతలు ఈ సమస్యను గుర్తించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జనాభా నియంత్రణ వల్ల వచ్చే అసమానతలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పెంపు అంశాన్ని 25 ఏండ్ల పాటు వాయిదా వేశారని చెప్పారు. కొత్తగా పెరిగే సీట్లలో సగం అంటే 50 శాతం మాత్రమే జనాభా ప్రాతిపదికన కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్రాల జీఎస్డీపీ, అభివృద్ధి ఫలితాల ఆధారంగా ఇవ్వాలన్నారు. ఈ విధానంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం లభిస్తుందని, వారు వెనుకబడరని పేర్కొన్నారు.

