పంపులు, లిఫ్ట్లు కట్టి వేల కోట్ల కమీషన్లు దండుకున్నరు: బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్

పంపులు, లిఫ్ట్లు కట్టి వేల కోట్ల కమీషన్లు దండుకున్నరు: బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్

నాగర్ కర్నూల్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా.. జడ్చర్లలో సీఎం రేవంత్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేస్తారని భావించామని, కానీ అలా జరగలేదని.. బీఆర్ఎస్ మాత్రం అబద్ధపు ప్రచారం చేస్తుందని సీఎం విమర్శించారు. 

పాలమూరులోని ఏ ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ పూర్తి చేయలేదని, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలు సాగయ్యేవని సీఎం వివరించారు. వేల కోట్లు ఖర్చు చేసి పంపులు, లిఫ్ట్లు మాత్రమే నిర్మించారని ఆరోపించారు. ఈ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి కావాలంటే.. రూ.55 వేల కోట్లు ఖర్చు చేయాలని.. వాళ్లు 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా.. 90 శాతం పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యమని సీఎం ప్రశ్నించారు.

27 వేల కోట్లు పంపులు, లిఫ్ట్‌లకే ఖర్చు చేశారని.. ప్రజలు అమాయకులు కాదని.. అన్నీ గమనిస్తున్నారని రేవంత్ హెచ్చరించారు. భూసేకరణ పూర్తి చేసి.. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీరు నిల్వ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని.. కర్నాటక తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీలపై దృష్టి సారిస్తామని సీఎం తెలిపారు. 

కేసీఆర్‌కు ఊడిగం చేయడం మాని.. జిల్లా అభివృద్ధికి అంతా కలిసి రావాలని సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. భూ సేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని -రేవంత్ హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడకుండా ఉంటే అదే పెద్ద సాయం అని సీఎం ఎద్దేవా చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పరిశీలించారు. కొల్లూరు మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్, నార్లాపూర్ రిజర్వాయర్, MGKLIS లిఫ్ట్-1 పంప్ హౌస్ పరిశీలించారు. కుమ్మెరలో PRLIS ప్యాకేజ్-8 స్టేజ్-3 పంప్ హౌస్ పనులపై అధికారులను ఆరా తీశారు. ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులు పరిశీలించారు.