ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి 25 ఏళ్లు ఎందుకు? చట్టసభల పోటీకి ఏజ్ తగ్గించాలి: సీఎం రేవంత్

ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి 25 ఏళ్లు ఎందుకు? చట్టసభల పోటీకి ఏజ్  తగ్గించాలి: సీఎం రేవంత్

దేశ రాజకీయాలో యువత పాత్ర మరింత క్రియాశీలకంగా మారాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు. చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల కనిష్ట వయోపరిమితిని ప్రస్తుతమున్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన అన్నారు.

21 ఏళ్ల వయస్సులోనే యువత సివిల్ సర్వెంట్ అధికారులుగా దేశాన్ని పాలిస్తున్నప్పుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి మాత్రం 25 ఏండ్లు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలనలో యువతకు పెద్దపీట వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

ఈ ప్రతిపాదనపై భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు . రాబోయే ఆగస్టు నెలలో శాసనసభలో దీనిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ ప్రతిపాదనను వివరిస్తానని, కూటమి పార్టీలన్నింటినీ త్వరలో కలుస్తానని వెల్లడించారు.

ఇదే వేదికగా దేశంలో నిరుద్యోగులను వేధిస్తున్న పేపర్ లీకేజీల అంశంపై కూడా సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్ తీవ్రంగా దెబ్బతింటోందని, వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఈడీల ద్వారా వేధించారని, అయితే యువత ఐక్యంగా పోరాడితే కేంద్రం సైతం తలవంచక తప్పదని ఆయన హెచ్చరించారు.