సీఎంతో క్షమాపణలు చెప్పించండి: బీజేపీ

సీఎంతో క్షమాపణలు చెప్పించండి: బీజేపీ
  •  అసెంబ్లీలో సీఏఏ, ఎన్పీఆర్ పై సీఎం తప్పుడు ప్రచారం 
  •  జిన్నా పాత్ర పోషిస్తున్న అసదుద్దీన్​ఒవైసీ
  •  రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్​

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సీఏఏ, ఎన్పీఆర్ పై తప్పుడు ప్రచారం చేసి, తెలంగాణ ప్రజల్లో  లేనిపోని అపోహలు కల్పించాడని, గవర్నర్ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించాలని బుధవారం రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్ తమిళసైని కలిసి కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్దేశ్యపూర్వకంగా సీఎం ప్రజల్ని తప్పుదారి పట్టించారని  బీజేపీ నేతలు లక్ష్మణ్​, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, చింతల రాంచంద్రారెడ్డి రాజ్ భవన్లో  గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సీఏఏ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా కేసీఆర్ ను ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్ కు ఇచ్చిన మెమోరాండంలో కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఎన్పీఆర్ ప్రక్రియ సజావుగా సాగేలా సర్కార్ ను ఆదేశించాలని కోరారు. అనంతరం రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు  లక్ష్మణ్​ రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు.

దేశాన్ని విభజించడంలో మజ్లిస్​అధినేత, ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ.. జిన్నా పాత్రను పోషిస్తున్నారని, దీనికి సీఎం కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేయించిన కేసీఆర్…అది కరెక్టే అని ఒప్పుకున్నప్పుడు, ఎన్పీఆర్ తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇండియన్​ సిటిజన్​షిప్​ కల్పించే జాబితాలో పాకిస్తాన్ ముస్లిం అనే పదం లేనందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు బాధపడుతున్నారా అని లక్ష్మణ్​ ప్రశ్నించారు. సీఏఏ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పదే పదే స్పష్టం చేసినప్పటికీ, సీఎం కేసీఆర్ కేవలం మజ్లీస్ మెప్పు కోసమే అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయించారన్నారు. పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత అసెంబ్లీలో చేసిన తీర్మానం చెల్లుబాటు కాదని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని , దాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరుస్తున్నారన్నారు. ఎన్నార్సీ గురించి కేంద్రం ఇంకా చర్చే చేయలేదని, అయినప్పటికీ తెలంగాణ ప్రజల్ని ఆందోళనకు గురిచేసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.