సీఎంసీ స్టాండింగ్ కమిటీలో 21 అంశాలకు ఆమోదం

సీఎంసీ స్టాండింగ్ కమిటీలో 21 అంశాలకు ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన సీఎంసీ ఆఫీసులో జరిగింది. ఇందులో పీజేఆర్ స్టేడియం అభివృద్ధి, అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం సహా 21 అంశాలతో పాటు రెండు టేబుల్ ఐటమ్ లకు ఆమోదించారు. అశోకవనం పార్కులో సైబరాబాద్ అర్బన్ బయోడైవర్సిటీ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐదు మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ వాహనాల కొనుగోలు, 30 కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, తొమ్మిది వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధి, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ల కొనుగోలు, 10 మోడల్​టాయిలెట్స్​నిర్మాణం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 

పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లో ఖాళీ అయిన 826 ఔట్‌‌‌‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. సీఎంసీ పరిధిలోని 32 ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన నిధుల మంజూరు ప్రతిపాదనను కార్పొరేషన్‌‌‌‌కు సిఫారసు చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల  కొనుగోలుకూ ఆమోదం తెలిపారు.  ఎన్‌‌‌‌హెచ్–65 నుంచి పీఎన్‌‌‌‌ఆర్ హిల్ వ్యూ వరకు, మియాపూర్ లోటస్ దవాఖాన నుంచి అమీన్‌‌‌‌పూర్  వరకు 30 మీటర్ల వెడల్పు రోడ్ల అభివృద్ధి ప్లాన్లను కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిటీ నిర్ణయించింది.  సీఎంసీ కమిషనరం సృజన పాల్గొన్నారు.