హైదరాబాద్, వెలుగు: సింగరేణి చేపట్టిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ టెండర్ ప్రక్రియను పూర్తి చేసి మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన అధికారులతో సమీక్షించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఆవరణలోనే రూ.6,800 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా టెండర్లను పిలిచినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణపు పనులు ప్లాన్ ప్రకారం చేపట్టాలని ఆదేశించారు.
బొగ్గు రవాణా, నీటి వసతులను పాత ప్లాంట్‌వే వినియోగించుకునే అవకాశం ఉన్నందున కొత్త ప్లాంట్ నిర్మాణ వ్యయం తగ్గుతుందన్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ వాటర్ రిజర్వాయర్‌లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలన్నారు. సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో పర్యావరణ హిత చర్యగా రూ.700 కోట్లతో నిర్మించనున్న ఫ్లు గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

