సోషల్ మీడియా వేదికగా భారత రాజకీయాలను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ.. అత్యంత వేగంగా యూత్ లోకి దూసుకుపోతోంది. పెద్ద పెద్ద పార్టీలకు ఏండ్లకు తరబడి ప్రయత్నించినా సాధ్యం కాని ఫాలోయింగ్ ను సోషల్ మీడియాలో సాధిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రమంలో అంతే స్పీడ్ గా థ్రెట్ కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎక్స్ అకౌంట్ ను ఇండియాలో ప్రభుత్వమే బ్యాన్ చేసిన క్రమంలో.. సీజేపీ కి హ్యాకర్ల బెడద కూడా ఎక్కువైంది.
లేటెస్టుగా తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందని కాక్రోచ్ పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. సీజేపీ బ్యాకప్ కూడా డౌన్ అయినట్లు ప్రకటించాడు. దీనిపై ఎక్స్ ఖాతాలో నంబర్ ఆఫ్ పోస్టులను పెట్టాడు. ఇన్ స్టా అకౌంట్ ను యాక్సెస్ చేయలేకపోతున్నానని.. మెటా కు ట్యాగ్ చేసినట్లు తెలిపాడు. రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ కావడంలేదని మెటాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో సెటైరికల్ గా మొదలై రాజకీయాలను శాసిస్తుందా అనే స్థాయికి చేరుకున్న సీజేపీ పార్టీని హ్యాక్ చేయడంపై నెటిజన్లు, మద్ధతుదారులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు రికవరీ కోసం ఎంత ట్రై చేసినా.. మీ భద్రత కోసం లాక్ చేయడం జరిగింది. అకౌంట్ ను తిరిగి పొందాలంటే మీ ఐడెంటిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని మెసేజ్ వస్తున్నట్లు పేర్కొన్నారు.
కాక్రోచ్ పార్టీ రికార్డు:
ఇండియాలో సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ మూవ్ మెంట్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. జస్ట్ ఆరు అంటే ఆరు రోజుల్లోనే 20 మిలియన్.. అక్షరాల 2 కోట్ల మంది ఫాలోవర్స్ . కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య ఇది. ప్రీ స్పీచ్ ట్యాగ్ చేస్తూ జెన్ జీ కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియా ఎక్స్ లో బ్లాక్ చేసినా.. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ మరో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత.. ఇన్ స్టాలో ఫాలోవర్స్ అమాంతం పెరగటం విశేషం. నియంతృత్వం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇన్ స్టాలో 6 రోజుల్లోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావటం.. ఈ నెంబర్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. ఈ నెంబర్ ఎక్కవ వరకు వెళుతుంది.. యూత్ కనెక్టివిటీ ఎంత ఉంటుంది.. ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.
'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)' మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు.
గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెనీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది.
ఈ క్రమంలో సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు.
