బుష్ఫైర్స్తో బూడిదకుప్పలా మారిపోయిన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో ఫైర్ సర్వీసెస్‌కు ఆర్థిక మద్దతు కోసం నెటిజన్లు భారీ ఎత్తున స్పందించారు. 48 గంటల్లోనే 2 కోట్ల డాలర్ల (రూ. 99.73 కోట్లు) విరాళాలు అందించారు. గత సెప్టెంబర్ నుంచి బుష్‌ఫైర్స్ వల్ల 24 మంది చనిపోయారు. 3 వేలకు పైగా సిబ్బంది రెస్క్యూ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్ సర్వీసెస్‌కు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలంటూ ఆస్ట్రేలియన్ కమెడియన్ సిలెస్ట్ బార్బర్ ఫేస్బుక్ ద్వారా శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ విపత్తు చాలా భయంకరంగా ఉంది. దయచేసి ఎవరికి తోచిన మార్గంలో వాళ్లు సహాయం చేయండి” అని కోరారు. బుష్‌ఫైర్స్ ధాటికి బార్బర్ కూడా తన ఇంటిని వదిలిపెట్టి వచ్చారు. వచ్చిన విరాళాలను న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్, బ్రిగేడ్స్ డొనేషన్స్ ఫండ్‌కు అందజేస్తామని తెలిపారు. యూఎస్ సింగర్ పింక్, ఆస్కార్ విన్నర్ నికోల్ కిడ్మన్ వంటి సెలబ్రిటీలు కూడా ఇటీవల రూ.3. 58 కోట్లు ఇచ్చారు.
