ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చికెన్ తినే వారు ఈ ఘటన తర్వాత కాస్త ఆలోచిస్తారేమో. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎక్కువ మంది తినే చికెన్.. కోల్డ్ స్టోరేజ్ లో గట్టిగా గడ్డ కట్టి.. బూజు పట్టి.. కుళ్లిపోయిన పరిస్థితిలో షాపులకు చేరుతోంది. 2026 మార్చి 27న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దొరికిన చికెన్ చూస్తే షాకవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్‌ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (H-FAST) బృందం అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు, హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న 'మెసర్స్ ఎస్.పి.ఆర్ (SPR) చికెన్' ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్‌ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, చికెన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
ఈ ఘటనకు సంబంధించి సూరజ్ పాల్ (66), అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉండే పాల్ చికెన్ హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్ సెంటర్ నుంచి సుమారు 352 కిలోల గడ్డకట్టిన కుళ్ళిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో రెక్కలు, చెస్ట్, లివర్, గిజార్డ్ వంటి భాగాలు స్వాధీనం చేసుకున్నారు.
చికెన్ నిల్వ ఉంచిన ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. FSSAI లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. నిల్వ చేసిన మాంసం తినడానికి యోగ్యమైనది కాదని తెలిపారు. హెచ్-ఫాస్ట్ బృందం స్వాధీనం చేసుకున్న మాంసాన్ని, నిందితుడిని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (SHO) కు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది, సనత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.
ప్రజలకు సూచనలు:
ఆహార పదార్థాలను కేవలం లైసెన్స్ ఉన్న పరిశుభ్రమైన కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. సరైన గుర్తింపు లేని విక్రేతల వద్ద ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పారు. ఎక్కడైనా అపరిశుభ్రమైన లేదా అనుమానాస్పద ఆహార తయారీ పద్ధతులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రజల సహకారం ఎంతో అవసరం అని ఈ సందర్భంగా అన్నారు.
