IPL 2026: గుడ్ న్యూస్.. బంగ్లాదేశ్‎లో ఐపీఎల్‎ ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

IPL 2026: గుడ్ న్యూస్.. బంగ్లాదేశ్‎లో ఐపీఎల్‎ ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

ఢాకా: బంగ్లాదేశ్‎లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఐపీఎల్ ప్రసారంపై ఉన్న నిషేధాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బంగ్లాదేశ్‎లో ఐపీఎల్ ప్రసారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తెలిపారు. 

క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేవలం వాణిజ్య కోణంలోనే పరిశీలిస్తామని తెలిపారు. బంగ్లాలో ఐపీఎల్‌ మ్యాచులను ప్రసారం చేయాలనుకునే బ్రాడ్‎కాస్టర్స్ అధికారులను సంప్రదించవచ్చని, ఆయా దరఖాస్తులను సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. 

మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాలో మెనార్టీలపై దాడులకు నిరసనగా ఐపీఎల్‎లో ఆ దేశ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే కేకేఆర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‎పై వేటు వేసింది బీసీసీఐ. ఈ చర్యపై అప్పటి యూనస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఐపీఎల్‎లో బంగ్లా ప్లేయర్లపై వేటుకు నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది యూనస్ సర్కార్. ఇదిలా ఉండగానే.. 2026, ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‎లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‎పీ పార్టీ ఘన విజయం సాధించింది. బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్ భారత్‎తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై యూనస్ సర్కార్ విధించిన నిషేధాన్ని ఎత్తి వేశారు. దీంతో బంగ్లాలోని క్రికెట్ ఫ్యాన్స్‎తో ఐపీఎల్ బ్రాడ్‎కాస్టర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‎లో కూడా ఐపీఎల్‎కు భారీ మార్కెట్ ఉంది. ఆ దేశంలో కోట్ల మంది క్రికెట్‎ను ఆరాధిస్తారు.