వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో మొజ్తాబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటాడని లేదంటే కోలుకోలేని స్థితిలో గాయపడి ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా సైన్యం ఇరాన్ రక్షణ సామర్థ్యాలను నిర్వీర్యం చేసిందని, ఆ దేశ వైమానిక దళం, నౌకాదళం, కమాండ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని పేర్కొన్నారు.
అమెరికా సైనిక చర్యలు ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టాయని.. ప్రస్తుతం ఇరాన్‌కు సుప్రీం లీడరే లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఇకపై పనిచేసే నాయకత్వం కూడా లేదని.. ఆ దేశంలో ఎవరూ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. అమెరికా దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. ఇరాన్‌కు చెందిన 22 మైన్-డ్రాపింగ్ నౌకలను ధ్వంసం చేశామని చెప్పారు.
కాగా, అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు చేసి ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆ దేశ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ రివేంజ్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ బాంబులు, మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది.
ఇదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైయిట్ ఆఫ్ హార్మూజ్ జల సంధిని క్లోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో యుద్ధాన్ని ఆపేద్దామని 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళికను ఇరాన్ కు ప్రతిపాదించింది అమెరికా. కానీ అమెరికా డిమాండ్లకు ఒప్పుకోని ఇరాన్.. యుద్ధం ఆపే ముచ్చటే లేదని స్పష్టం చేసింది.
