మిల్లుల్లో వడ్లకు భద్రత ఏదీ?..రూ.30 వేల కోట్లకు పైగా ధాన్యం మిల్లుల్లోనే

మిల్లుల్లో వడ్లకు భద్రత ఏదీ?..రూ.30 వేల కోట్లకు పైగా ధాన్యం మిల్లుల్లోనే
  • బ్యాంక్ గ్యారంటీల కంటే ఎన్నో రెట్లు అధిక నిల్వలు
  • గోదాముల్లోనే నిల్వ చేయడం సురక్షితమంటున్న నిపుణులు
  • మిల్లర్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల టన్నుల ధాన్యం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్‌‌లకు చెందిన దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల రైస్ మిల్లుల్లోనే నిల్వ ఉంది. మిల్లర్ల నుంచి తీసుకున్న బ్యాంక్ గ్యారెంటీలకు , నిల్వ ఉన్న ధాన్యం విలువకు ఏమాత్రం పొంతన లేదు. బ్యాంకు గ్యారంటీల కన్నా ఎన్నో రెట్ల విలువైన వడ్లు మిల్లుల్లో ఉన్నాయి.

ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్​ పెట్టుకుంది. అంత ధాన్యాన్ని నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేక మిల్లుల్లోనే అన్​లోడ్​ చేస్తోంది. కొందరు మిల్లర్లు ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎంఆర్ అప్పగింతలో అక్రమాలు 

మిల్లర్లు చాలామంది ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్) పూర్తిగా ఇవ్వకుండా బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకున్నారని, ఆ డబ్బులను ఇతర వ్యాపారాలకు మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్‌‌, టాస్క్‌‌ఫోర్స్ తనిఖీల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి, మిల్లుల్లో నిల్వలకు మధ్య భారీ తేడాలు బయటపడ్డాయి. 2022-– 23 యాసంగి సీజన్‌‌కు సంబంధించి లక్షల టన్నుల ధాన్యం మాయం కావడం అప్పుడు సంచలనంగా మారింది.

మిల్లుల్లో మిగిలిన ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవగా టెండర్​ దక్కించుకున్న సంస్థలు 18.95 లక్షల టన్నుల వడ్లు మాత్రమే తీసుకుని చేతులెత్తేశాయి. మిగిలిన 19.05 లక్షల టన్నుల వడ్లకు సంబంధించి రూ.4,263.08 కోట్లు మిల్లర్ల నుంచి వసూలు కావాల్సిఉంది. అయితే, కొన్ని మిల్లుల్లో వడ్లు కూడా లేవని, బియ్యాన్ని అమ్ముకున్నారని తేలడంతో కొందరు మిల్లర్లపై ఇప్పటికే రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.

మిల్లులకు ధాన్యం కేటాయించిన తర్వాత అధికారులు పర్యవేక్షించకపోవడం వల్ల ధాన్యం పక్కదారి పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గడువులోగా బియ్యం అప్పగించేలా జిల్లా స్థాయి సివిల్ సప్లయ్స్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. మిల్లర్లకు కొందరు అధికారులు సహకరించడం వల్లనే అక్రమాలు జరుగుతున్నాయని, అందువల్లే మూడేండ్ల కింద మాయం అయిన ధాన్యం కూడా ఇంకా పూర్తిగా రికవరీ కాలేదని అంటున్నారు. 

గోదాముల్లో నిల్వ చేయడమే మేలు

మిల్లుల్లో ధాన్యం ఉంచడం అంత భద్రం కాదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో పెద్ద ఎత్తున గోదాములు నిర్మించి, ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచిస్తున్నారు. మిల్లులకు పరిమితంగా ధాన్యాన్ని తరలించాలని, సీఎంఆర్​ అప్పగించిన తర్వాత మిగతా ధాన్యాన్ని ఇవ్వాలని, దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. శాస్త్రీయ విధానాలతో గోదాముల్లో నిల్వ చేస్తే ధాన్యం నాణ్యత కాపాడవచ్చని, మార్కెట్ పరిస్థితులను బట్టి తర్వాత మంచి ధరలకు విక్రయించే అవకాశమూ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో పాటు వారికి సహకరించిన అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కేటాయింపు నుంచి సీఎంఆర్ రికవరీ వరకు పూర్తిస్థాయి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలని, ప్రతి మిల్లులో జీపీఎస్ ఆధారిత నిల్వ పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బ్యాంక్ గ్యారెంటీలను ప్రస్తుత మార్కెట్ విలువలకు తగ్గట్టుగా పెంచాలని చెబుతున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న వేళ, నిల్వల భద్రతపై ప్రభుత్వం తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మిల్లుల్లోనే రూ.30వేల కోట్ల ధాన్యం

ప్రభుత్వలెక్కల ప్రకారం గతంలో పెండింగ్‌‌లో ఉన్న ధాన్యం విలువ రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఉంది. 2022- –23 యాసంగి సీజన్‌‌కు చెందిన ధాన్యం విలువ మరో రూ.4 వేల కోట్లు కాగా, గత వానాకాలంలో సేకరించిన 70 లక్షల టన్నుల ధాన్యం విలువ దాదాపు రూ.16 వేల కోట్లు. ప్రస్తుత యాసంగిలో ఇప్పటికే 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, దాని విలువ దాదాపు రూ.11 వేల కోట్ల వరకు ఉంటుంది.

దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లుల్లో ఉంది. మిల్లుల్లో ఉన్న ధాన్యం విలువకన్నా మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ధాన్యం మాయం అయితే రికవరీ చేయడం ఎలా అని అధికారులు కలవరపడుతున్నారు. గతంలో మిల్లర్లు లక్షల టన్నుల ధాన్యాన్ని కాజేసినా పూర్తి స్థాయిలో రికవరీ చేయలేకపోయారు.