అరకొర సౌలతులతో స్టూడెంట్లకు కష్టాలు

అరకొర సౌలతులతో స్టూడెంట్లకు కష్టాలు

హైదరాబాద్, వెలుగు: పురుగులు పట్టిన బియ్యం.. ఉరుస్తున్న స్లాబులు.. వాన పడితే రూముల్లోకి నీళ్లు.. వరద నీటిలో బిల్డింగ్‌‌‌‌లు.. ఘోరంగా పారిశుద్ధ్యం.. మెయింటెనెన్స్‌‌‌‌ ఊసే లేదు.. ఫలితంగా స్టూడెంట్లకు ఫీవర్లు, ఫుడ్ పాయిజన్ సమస్యలు. ఇదీ రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలోని పరిస్థితి. తనిఖీల కోసం వెళ్లిన టీమ్‌‌‌‌ల ద్వారా వెల్లడైన చేదు నిజాలివి. అరకొర సౌలతులు, నిర్వహణపై పట్టింపులేని అధికారుల తీరుతో గురుకులాల్లో నెలకొన్న సమస్యలు కలవరపెడుతున్నాయి. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాలకు సర్కారు భారీగా కిరాయిలు కడుతున్నా.. వాటి యజమాను లు మాత్రం మెయింటెనెన్స్‌‌‌‌ను పట్టించుకోవడం లేదని తనిఖీల్లో తేలింది. బీసీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిశీలించేందుకు ప్రత్యేక టీంలను బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఏర్పాటు చేసింది. వైరల్  ఫీవర్స్, డయేరియా, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు పెరిగిపోవడం, అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యల కోసం ఈ టీమ్స్‌‌‌‌ను పంపింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐదు టీంలు ఈ నెల 3, 5 తేదీల్లో హాస్టళ్లు, గురుకులాలను పరిశీలించాయి. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం రాత్రి ప్రభుత్వానికి అందజేశాయి.

అద్దె భవనాలతో అవస్థలు

రాష్ట్రవ్యాప్తంగా 261 బీసీ గురుకుల పాఠశాలలు ఉంటే అందులో 132 బాయ్స్, 129 గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి. మరో 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలు, ఒక మహిళా డిగ్రీ కాలేజీ ఉన్నాయి. మిగతా ప్రీమెట్రిక్ హాస్టళ్లున్నాయి. ప్రభుత్వం కొంతకాలం క్రితం 119 స్కూల్స్‌‌‌‌ను అప్ గ్రేడ్ చేయడంతో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్య 138కి చేరుకుంది. అన్ని ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ కలిపి 1.52 లక్షల మంది చదువుకుంటున్నారు. ఒక్కో గురుకులంలో 480 మంది ఉంటున్నా.. అంతమందికి సరిపడా వసతులు ఎక్కడా లేవు. ఇంచుమించు అన్ని చోట్ల అరకొర సౌలతులే. మొత్తం భవనాల్లో అద్దెవే 85 శాతం దాకా ఉన్నాయి. ఈ భవనాల కోసమే కిరాయి రూపంలో సర్కారు రూ.150 కోట్లు వెచ్చిస్తున్నది. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు, కొన్నింటికి అత్యధికంగా రూ.14 లక్షల దాకా వెచ్చిస్తున్నది. ఇంత పెద్దమొత్తంలో కిరాయి చెల్లిస్తున్నా ప్రైవేటు యజమానులకు పట్టింపులేకుండా పోయింది. ఆ బిల్డింగ్‌‌‌‌లన్నీ టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో ఉండటంతో అధికారులు కిమ్మనడంలేదు. కొన్ని బిల్డింగ్‌‌‌‌లు ఎమ్మెల్యేలవి కావడంతో ఏం జరిగినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక గురుకులం పూర్తి అస్తవ్యస్తంగా తయారైంది. ఆ బిల్డింగ్‌‌‌‌ను తరలించాలని కలెక్టర్ చూస్తున్నా.. అక్కడి ఎమ్మెల్యే మాత్రం దాన్ని కదపడానికి ఇష్టపడటం లేదు. 

కొన్ని చోట్ల పురుగుల బియ్యమే సరఫరా

కొన్నిచోట్ల తనిఖీ టీమ్స్‌‌‌‌కి పురుగుల బియ్యం కనిపించాయి. వాటి గురించి గట్టిగా నిలదీయడంతో నెపాన్ని సివిల్ సప్లయ్స్ అధికారుల మీదకు నెట్టారు. మరికొన్ని చోట్ల పురుగుల్ని చంపేందుకు ట్యాబ్లెట్స్ వేయించారు. ఇంకొన్ని చోట్ల మాత్రం పురుగులు పట్టిన బియ్యాన్ని సివిల్ సప్లయ్స్ శాఖకు తిప్పి పంపుతున్నారు. గురుకులాలకు సర్కారు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో అది కనిపించడం లేదు. నలుగురు ఉండే రూముల్లో 8 నుంచి 10 మంది దాకా ఉండాల్సి వస్తున్నది. ప్రతి 20 మందికి ఒక బాత్రూం ఉండాలి కానీ 40 మంది స్టూడెంట్స్ ఒక్క బాత్రూమ్ నే వాడాల్సి వస్తున్నది. వీటి గురించే కొందరు అధికారులకు అక్కడి స్టూడెంట్స్ చెప్పినట్లు తెలుస్తున్నది.

పదుల సంఖ్యలో పిల్లలకు జ్వరాలు

హాస్టళ్లలో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు తనిఖీ టీంలు గుర్తించినట్లు తెలుస్తున్నది. ప్రతి చోటా పదుల సంఖ్యలో పిల్లలు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నట్లు సమాచారం. గురుకుల భవనాల్లో వర్షపు నీరు చేరి ఇబ్బంది నెలకొంది. జ్వరాల బారిన పడిన పిల్లలకు అక్కడికక్కడే మందులు ఇవ్వడం, తీవ్రత ఉంటే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లడం చేస్తున్నారు. స్కూలు ప్రాంగ ణాల్లో ఎక్కడికక్కడ నీరు నిలవడంతో అడుగుతీసి అడుగేయాలంటే పిల్లలు భయపడుతున్నారు. డ్రైనేజ్ వాటర్ బిల్డింగ్స్ పరిసరాల్లోనే నిలిచి ఉంటు న్నది. గతంలో మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్స్‌‌‌‌ను కొన్నేళ్ల నుంచి గురుకులాలకు ఉపయోగిస్తున్నారు. శిథిలావస్థకు చేరినా కొనసాగిస్తున్నారు తప్పితే మరమ్మతులు చేయడం లేదు. ఈ విషయాలు బయటకు పొక్కకుండా జిల్లాల కలెక్టర్లు, సంక్షేమాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.